Minister Komatireddy On GHMC Divide : హైదరాబాద్ మహానగర జనాభా కోటిన్నర దాటిందని జీహెచ్ఎంసీని నాలుగు మేయర్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసోచామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్‌లో కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగర రూపు రేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
దాదాపు 30వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనివల్ల రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లావాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మూసీ కంటే విషపూరితమైన సబర్మతిని ప్రక్షాళన చేసి మంచినీరు ప్రవహించే విధంగా మార్చారన్నారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం : ఎన్నో పరిశ్రమల నుంచి రసాయనాలతో పాటు మురికి నీరంతా మూసీలోకే వస్తోందని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ సుందరీకరణ పూర్తి చేసి తీరుతామని కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని, తాము మరింత ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాద్దాంతం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అర్బన్ స్ట్రాటజీస్, పాలసీస్, రెగ్యులేషన్ అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు.