Minister Komatireddy Venkat Reddy Chitchat : ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్ వేస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు మరమ్మత్తులు చేపడతామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కేసీఆర్‌కు ప్రజలపై ప్రేమలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌కు వాళ్లు సరికారు, సాటి కారు అసలు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళితే తాను చూసుకోవడానికి ఉన్నానని, బీఆర్ఎస్కు తాను చాలునని వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లానని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా తన ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లారని అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు.
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే : బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కాంగ్రెస్‌తో కలిసి ఉంటారని ఎక్కడి వెళ్లరని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్పీ విలీనం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని చెప్పారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తానని రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని తెలిపారు. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.