Minister Komatireddy Conducted Review of Road Safety Measures :హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్‌హెచ్ 65 రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను సమావేశంలో చర్చించారు.
Black Spots Identified Locations : హైవేలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు వివరించారు. అవి వరుసగా చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపురం, అకుపాముల, కోమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్ రోడ్స్, నవాబ్‌పేట జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.
రహదారి భద్రతా చర్యల గురించి సమీక్ష నిర్వహించిన మంత్రి :బ్లాక్ స్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రహదారిపై కొన్నిచోట్ల ఆరులేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్‌లు, సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి ప్రణాళికలు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల ప్రాంతీయ అధికారి రజాక్, తదితరులు పాల్గొన్నారు.