Telangana Digital Health cards Project In WEF White Paper : ప్రపంచ ఆర్థిక ఫోరం శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రాజెక్టును ప్రస్తావించింది. హెల్త్ డేటా సేకరణ అవసరాన్ని వివరిస్తూ విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్రంలో జరిగిన ప్రయోగాత్మక పరిశీలనను వివరించింది. భారత్‌లో హెల్త్ డేటా ఆవిష్కరణలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం పేర్కొంది. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జరిపిన ఆరోగ్య పరీక్షల్లో గుండె, గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ప్రపంచ ఆర్థిక ఫోరం శ్వేతపత్రంలో వెల్లడించింది.
అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన పైలట్ ప్రాజెక్టు : రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ ప్రాజెక్టును కీలకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కేస్ స్టడీలను వివరించిన డబ్ల్యూఈఎఫ్ రాష్ట్ర ప్రాజెక్టును కూడా అందులో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి గ్లోబల్ హెల్త్ నెట్ వర్క్ తయారు చేయాల్సిన అవసరాన్ని శ్వేతపత్రంలో వివరించారు.
హెల్త్ డేటా సిద్ధంగా ఉన్నట్లయితే ప్రజలు కొన్ని ఆరోగ్య పరీక్షలను పదేపదే చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారతదేశంలో హెల్త్ డేటాపై ప్రయోగాలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏకీకృత హెల్త్ డేటా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని వివరించింది. భవిష్యత్తులో సమీకృత హెల్త్ డేటా సిస్టమ్స్‌ను కీలకంగా మార్చాలన్న భారత సంకల్పానికి ఇది నిదర్శనమని వెల్లడించింది.
వన్ స్టేట్ వన్ కార్డు పేరుతో పైలట్ ప్రాజెక్టు : ప్రజల హెల్త్ డేటాను సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏడు ప్రయత్నాలను ప్రస్తావించిన ప్రపంచ ఆర్థిక ఫోరం రాష్ట్రంలోని కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టును అందులో ఒకటిగా పేర్కొంది. సంక్షేమ పథకాలను ఒకే కార్డు ద్వారా ప్రజలకు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం "వన్ స్టేట్ వన్ కార్డు' పేరుతో పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ సేవలకు పలు కార్డులు ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపింది.
ఏకీకృత డేటా లేకపోవడంతో ప్రజలు రోగ నిర్ధారణ పరీక్షలు మళ్లీ మళ్లీ చేయించుకోవాల్సి వస్తోందని దానివల్ల ప్రజలపై భారం పడుతోందని నివేదికలో పేర్కొంది. హెల్త్ డేటా సిద్ధంగా ఉంటే వైద్యులు త్వరగా నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుందని అందులో పేర్కొంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు 30 రకాల పరీక్షలు చేశారని వివరించింది. ఆయా ప్రాంతాల్లో గుండె వ్యాధులు, గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపింది. త్వరలో ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులిచ్చి సమర్థంగా దీన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరం శ్వేతపత్రంలో పేర్కొంది.