AIMIM With Congress in Telangana : రాజకీయాలు ఎన్నికలప్పుడే అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అంటున్నాయి కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఇరు పార్టీల ఆలోచనలు, విధానాలు ఒకటేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. మెట్రోరైలు విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీలో మెట్రో మార్గానికి ఇద్దరు నేతలు కలిసి శంకుస్థాపన చేశారు.
CM Revanth Laid Foundation For Old City Metro Project : అనంతరం వేదికపై ఇద్దరు నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి మొండిఘటమని, పట్టుదలతో అనుకున్నది సాధించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని అసదుద్దీన్ ఓవైసీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికారాన్ని పూర్తిగా వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన సూచించారు.
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi on Congress Govt : హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ పార్టీ తరపున మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ప్రకటించారు. అంతేకాకుండా పాతబస్తీలో అభివృద్ధి పనులకు అడిగిన వెంటనే నిధులు సమకూర్చిన రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చిరకాల కోరిక అయిన మూసీనది అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని, చంచల్ గూడ జైలును తరలించి ఆ ప్రదేశంలో పేదల కోసం విద్యాసంస్థను నిర్మించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణలో కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.
CM Revanth on Hyderabad Development : అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తిపై స్పందించిన రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ జైలును తరలించి కేజీ టూ పీజీ వరకు ఆ పరిసర ప్రాంత పేద ప్రజలకు ఉపయోగపడే విద్యాసంస్థను నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే తన హయాంలో తప్పకుండా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజల మద్దతుతో అక్బరుద్దీన్, అసదుద్దీన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారని తెలిపారు. అయితే రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, మిగిలిన సమయమంతా అభివృద్ధి పనులపై దృష్టి పెడుతామని రేవంత్‌రెడ్డి చెప్పారు.