Micro Plastic Effects To Humans :ఇందుగలదందులేదని సందేహము వలదు అన్న మాట మైక్రోప్లాస్టిక్‌కు సరిగ్గా సరిపోతుంది. నిన్నమొన్నటిదాకా మహాసముద్రాలు, చెత్తకుప్పలు లాంటి ప్రాంతాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయని భావించేవారు. కానీ, అవే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు మనిషి శరీరంలోకి వెళ్తున్నాయి. చిన్న మోతాదులో ఉండే మైక్రోప్లాస్టిక్‌లు మానవ అవయవాల్లోకి సునాయసంగా ప్రవేశిస్తున్నాయి. అంతే కాదు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ఇదే విషయం అనే పరిశోధనల్లో వెల్లడవ్వగా తాజాగా మానవ శరీరంలోని సున్నిత భాగాల్లోనూ మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు గుర్తించారు. పురుషుల్లో సంతాన సమస్యలు తగ్గడానికి ఇవే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.
పరిశోధనలో భాగంగా 23 మంది పురుషుల మృతదేహాలు, 47 పెంపుడు జంతువుల కళేబరాల సున్నిత భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం కనిపించింది. శునకాల్లో ప్రతి గ్రాము కణజాలంలో 123 మైక్రో గ్రాములు, మానవుల్లో 330 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు కనిపించాయి. ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లలో వాడే పాలీఇథలీన్ పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ప్లాస్టిక్ బాటిళ్లతో సింథటిక్ నూలు ఉత్పత్తి, విదేశాలకు ఎగుమతి, తక్కువ ఖర్చుతో తయారీ
మెదడులోకి ప్రవేశించే సామర్థ్యం : మనిషికి తెలియకుండానే శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్ రేణువులు ప్రతి అవయవానికి చేరుతున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోడే ఐస్‌ల్యాండ్ పరిశోధకుడు జైమే రాస్ నేతృత్వంలోని పరిశోధనల్లో అనేక విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. చిన్న పరిమాణంలో ఉండే సూక్ష్మ ప్లాస్టిక్‌లు మెదడులోకి చొచ్చుకుపోగలవని గుర్తించారు. దీంతో మనిషి ప్రవర్తనలో మార్పులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.
మధ్య వయసు, వృద్ధ ఎలుకలపై 3 వారాల పాటు అధ్యయనం చేసిన పరిశోధకులు వాటికి మైక్రోప్లాస్టిక్‌లు కలిగిన తాగునీటిని అందించారు. 3 వారాల తర్వాత పరిశీలించగా మూత్రపిండాలు, మెదడు, కాలేయం, జీర్ణవాహిక, ప్లీహం, ఊపిరితిత్తులలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయి. రక్త ప్రవాహాన్ని నాడీ వ్యవస్థ నుంచి మైక్రోప్లాస్టిక్స్ వేరు చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల న్యూరోకాగ్నిటివ్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు తేల్చారు.
ఇకపోతే చైనాలోని బీజింగ్ అంజెన్ ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తల బృందం మనిషి గుండెలోనూ మైక్రోప్లాస్టిక్ పదార్థాలను గుర్తించింది. గుండె ఆపరేషన్ చేయించుకున్న 15మంది రోగుల గుండె కండరాలను, రక్తాల నమూనాలను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా మనిషి గుండెల్లో మైక్రోప్లాస్టిక్ చేరడం ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు.
ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరుతున్నట్లు నెదర్లాండ్ శాస్త్రవేత్తలు 2022లో గుర్తించారు. పరిశోధన జరిపిన 80% మంది రక్త నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు. 22 మంది రక్తం సేకరించి, పరీక్షించగా17 మంది రక్తంలో గుర్తించదగ్గ మోతాదులో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి పాలీప్రొఫిలీన్, పాలిస్టిరీన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలీన్, పాలిథిలీన్ టెరాఫ్తలేట్ లాంటి 5 రకాల మైక్రోప్లాస్టిక్‌లను గుర్తించారు.
ఇలా రక్తంలో కలిసే ప్లాస్టిక్ కణాలు మానవ శరీరం మొత్తం ప్రయాణిస్తూ వివిధ అవయవాల్లో తిష్ట వేసే ప్రమాదమూ ఉంది. సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాలు, రక్తం, కాలేయం, కిడ్నీ, గుండె తదితర ముఖ్యమైన అవయవాల్లోకి చాలా సులువుగా ప్రవేశించగలవు. గర్భంలో ఉన్న శిశువు శరీరంలోకీ ఇవి చేరే ప్రమాదం ఉంది.