Metro Rail Officials On Metro Parking Fee :నగరంలో మెట్రో రైలులో ప్రయాణించే వారికి ఎల్అండ్టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని ఎల్అండ్టీ ప్రకటించింది. మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లు ఉండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది. అందులో చాలా స్టేషన్లలో ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్‌లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
అనూహ్యంగా ఆ రెండు చివరి స్టేషన్లలో కూడా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తివేస్తూ డబ్బులు వసూలు చేయడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు పెంచడంతో పాటు పార్కింగ్ ఫీజుతో వసూళ్లకు పాల్పడటం అన్యాయమంటూ ఎల్అండ్టీ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నాగోల్, మియాపూర్ స్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని స్పష్టం చేసింది.
మెరుగైన సదుపాయాలు అందించేందుకే :ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రోస్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది. పైలట్ రన్‌గా ఇవాళ నాగోల్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పరిశీలించామని, ప్రయాణికుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేసి ఆగస్టు 25 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎల్అండ్టీ పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.