MHA Report On Cyber Crimes :ఈ కంప్యూటర్ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సప్‌నే వినియోగిస్తున్నారట. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
వాట్సప్ వేదికగా ఎక్కువగా సైబర్ మోసాలు :మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ జాబితాలో టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నట్లుగా పేర్కొంది. 2023-24 సైబర్ మోసాల జాబితాను హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. 2024 తొలి 3 నెలల్లో వాట్సప్ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 కంప్లైంట్లు వచ్చినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇక, టెలిగ్రామ్‌లో మోసాలపై 22,680, ఇన్‌స్టా వేదికగా జరిగే క్రైంలపై 19,800 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.