Medicine Shortage in Government Hospitals : రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతోంది. ట్రీట్మెంట్ వరకు ఉచితంగానే అందుతున్నా, ఔషధాలు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని బాధితులు వాపోతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్లు రోగులకు ఐదారు రకాల మందులు రాస్తే, అందులో కేవలం ఒకటి లేదా రెండు రకాలకు మించి దొరకడం లేదు. నగరంలో ప్రధాన ఆసుపత్రులైన గాంధీ హాస్పిటల్, ఉస్మానియాల్లోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. మందుల కోసం ప్రతి రోగి కనీసం రూ.200 నుంచి రూ.300 వరకు బయట వెచ్చించాల్సిందే.
రోగులకు తగ్గట్లు లేని సరఫరా : సాధారణంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అధికారిక పడకలు, నిత్యం వచ్చే రోగులను పరిగణలోకి తీసుకుని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం మందులు ఇక్కడి నుంచే రాగా, మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. అయితే అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రోగులందరికీ మందులు సరఫరా చేయలేకపోతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పడకలు 1,100 వరకు ఉండగా, నిత్యం 1,500 మందికి పైగానే రోగులు వస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్లో 1000 పడకలకు గానూ 1,500 పైనే రోగుల తాకిడి ఉంటోంది. సీజన్‌లో ఈ రెండు ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 2 వేలకు పైగానే పెరుగుతోంది. ఆ స్థాయిలో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండటం లేదు.