Media Mogul Ramoji Rao Grand Daughter Keerthi Sohana Interview : తాతగారు ( రామోజీ రావు) ఓ సారి విమానంలో వెళుతున్నారట. ఆయన పక్కన కూర్చున్న ఓ పత్రిక అధిపతితో ‘పేపర్ ఉదయాన్నే వచ్చేలా చూసుకోండి. నంబర్ 1 మీదే అవుతుందని' చెప్పారట. దానికి అవతలి వ్యక్తి ‘పేపర్ నడపడం నీకేం తెలుసున్నట్లుగా' చూశారట. ఆ వ్యక్తి చూసిన చూపే ఆయనలో పత్రిక పెట్టాలన్న కసిని తీసుకొచ్చిందట. తాతగారు తన జీవితంలో జరిగిన అనుభవాలన్నీ ఇలా కథలుగా మాతో పంచుకునేవారు.
ప్రస్తుతం ఆయన ప్రపంచానికే మీడియా బ్యారన్. మాకు మాత్రం ప్రేమ అమృతాన్ని పంచే తాతయ్య. మేం అయిదుగురం ఆయనకు పంచప్రాణాలు. నన్ను ముద్దుగా ‘డార్లింగ్ నంబర్ త్రీ’ అని పిలిచేవారు. నాన్న పోయాక తండ్రిలా నా బాధ్యత తీసుకున్నారు. ‘ఏ సబ్జెక్టు తీసుకోను’ అని తాతగారినే అడిగితే, నాకు నచ్చిందేంటో కనుక్కుని అదే చేయమన్నారు.
మనవరాళ్లు, మనవడితో రామోజీరావు (ETV Bharat) నా దగ్గర మాట తీసుకున్నారు - ఆయన కోరికను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తా: రామోజీరావు మనవడు సుజయ్ - RAMOJI RAO GrandSon Sujay Interview
యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో లీజర్ మేనేజ్‌మెంట్ చదివేటప్పుడు ప్రతి ఆదివారం తప్పకుండా మాట్లాడేవారు. మాపై ఒకసారి కూడా కోపంగా అరవడం, ఇదే చేయాలని చెప్పడం నేనెప్పుడూ చూడలేదు. అయితే పుస్తకాలు మాత్రం చదవాలని చెప్పేవారు. మంచి వ్యాసాలను నాకు పంపేవారు. వాటిని చదవకపోతే మాత్రం సున్నితంగా మందలించేవారు తప్ప కోపం ప్రదర్శించేవారు కాదు.
ఆయన నిత్య విద్యార్థి. ‘నేర్చుకోవడమే జీవితం, అది లేకపోతే అక్కడితో ఆగిపోయినట్లే’అని మాకు చెప్పేవారు. నేను మాత్రం స్లో రీడర్‌ని. ఎందుకంటే బాగా అర్థం అయ్యే వరకు పేజీ తిప్పేదాన్ని కాదు. అందుకని ‘ఎక్కువ చదవాలి, అదొక అలవాటుగా చేసుకోవాలనే వారు. బుక్‌లో రాసినవన్నీ పాటించక్కర్లేదు. సొంతంగా ఆలోచించాలని. పుస్తకాల్లో రాసేదీ మనలాంటివాళ్లే. వాళ్లు చెప్పిన వాటిలో మంచిని మాత్రం తీసుకుని, చెడుని వదిలేయండి’ అనే వారు. చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు మార్క్ చేసి, చదవమనేవారు. తమ తమ రంగాల్లో ఎదిగిన మహిళల గురించి చెప్పేవారు. అమ్మాయిలు ముందు కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేవారు.
మా తాత చెప్పిన పాఠాలన్నీ నా భవిష్యత్తుకు పునాదులే : రామోజీరావు మనవరాలు సహరి - Ramoji Rao Granddaughters interview
కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేసిన వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పేవారు. ఒకసారి ఫిల్మ్‌సిటీలో ‘ఫండుస్థాన్’ పై నేను కొన్ని మార్పులతో ప్రెజెంటేషన్ చేసిస్తే మెచ్చుకున్నారు. నిజమా తాతగారూ అని నేను ఆశ్చర్యంగా అడిగితే ‘నిజంగానే 20 ఏళ్లకే బాగా చేశావని మెచ్చుకున్నారు. తాతగారి నుంచి ప్రశంసలు కాస్త అరుదుగానే దక్కేవి. సంతోషం, కష్టం ఏది వచ్చినా నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి అందరిలోకి నువ్వే సెన్సిటివ్, ధైర్యంగా ఉండాలని భుజం తట్టేవారు. నా పెళ్లినీ ఎప్పటికీ మర్చిపోలేను. తాతగారే కన్యాదానం చేశారు. ‘అయ్యో వినయ్ చాలా చిన్నవాడు కదా! తన కాళ్లు తాతగారు కడగాలా’ అని గిల్టీగా అనిపించింది. నిజానికి తాతగారికి అలాంటి విశ్వాసాలు లేకపోయినా మనవరాలినైన నాకోసం వాటి అన్నింటినీ సంతోషంగా చేశారు.
తాతగారి వల్ల హెల్పర్లు కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటారు. విరామమైనా, వినోదమైనా ఆయనకు పనిలోనే ఆనందం. అలాంటప్పుడు సెలవు ఎందుకు అని ప్రశ్నిస్తే ఆశ్చర్యమేసేది నాకు. తాతగారి మెదడు అక్షయపాత్రేమో అనిపిస్తుంది. నిరంతరం కొత్త ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. వాటిని మర్చిపోకుండా ఆయన పాకెట్‌బుక్‌లో రాసుకునేవారు. సాధ్యమవుతాయి అనిపించినవి లోతుగా అధ్యయనం చేసేవారు. ‘నేను చేసేదేదైనా కొత్తగా ఉండాలి. వేరే వాళ్లను అనుసరిస్తే అందులో నా ప్రత్యేకత ఏముంది’ అని ఆయన చిన్నతనం నుంచే అనుకునేవారట. అందుకే ప్రయోగాలు ఎన్నో చేశారు. అయినా కిటికీలోంచి చూస్తూ ‘ఈ విశ్వంలో భూమెంత? అందులో ఇండియా, దాంట్లో నేను ఓ చిన్న రేణువును’ అనుకునే వారే తప్ప సాధించేశా అన్న గర్వం అసలు కనిపించేది కాదు. ఇన్నేళ్లలో ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో పాఠాలు. ప్రతిదీ అపురూపమే. ఇప్పుడు ఆయన లేరంటే శూన్యంగా అనిపిస్తోంది. కానీ ఆయన ఆలోచనలు, ఆశయాలు మా వెంటే ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు నన్ను మోటివేట్ చేసేది తాతగారి పేరే! దాన్ని మేమంతా జాగ్రత్తగా కాపాడాలి. ఆయన ఒక్కరు చేసింది. అమ్మ, పెద్దమ్మ, పెదనాన్నల సహకారంతో మేం అయిదుగురం ముందుకు తీసుకెళ్లాలి. ఇదే మాపై ఉన్న కర్తవ్యం!