తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు తెలుసా? - Samakka Saralamma Festival

Medaram Jatara : తెలంగాణ త్యాగాల గడ్డ. పోరాటాల భూమి. వీరుల జన్మస్థలం. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అనేక మంది త్యాగధనులకు పుట్టినిల్లు. అలాంటి వారిలో దైవంగా పూజలు అందుకుంటుంది మాత్రం సమ్మక్క, సారలమ్మ. ఆ అమ్మలగన్న అమ్మల జాతరకు సమయం ఆసన్నమైంది. ఆధునిక యుగంలోనూ ఆదిమ గిరిజన సంస్కృతికి వారధి కట్టి రెండేళ్ల తర్వాత మళ్లీ జరగనున్న ఈ వేడుక కోసం యావత్‌ తెలంగాణ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. నాలుగు రోజుల ఈ జాతర కోసం తెలంగాణ ప్రజల ప్రయాణం అంతా మేడారం వైపే సాగనుంది.

Sammakka Saralamma Festival
Medaram Jatara

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 4:00 PM IST

నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు

Medaram Jatara Story : ఒక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేవి ఆ ప్రాంతంలో మాత్రమే జరిగే పండుగలు. తెలంగాణ ప్రాంతానికి ఏడాదికి ఒకసారి జరిగే బతుకమ్మ పండుగ ఆ గుర్తింపును తెస్తే రెండేళ్లకు ఒక సారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర ఆ గుర్తింపును రెట్టింపు చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లో ఈ జాతర జరగనుంది. పేరుకు తెలంగాణలో జరిగినా దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు కలిసి నిర్వహించుకునే మహా జాతర ఇది. ఆ వేడుకకు ఇప్పుడు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. దేశ విదేశాల నుంచి కోటి మందికి పైగా భక్తులు వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని తరించనున్నారు.

ఆధ్యాత్మిక చైతన్యానికి, అడవి బిడ్డల వీరత్వానికి, ఆదివాసుల ఆత్మాభిమానానికి, అమరులైన శూరుల త్యాగ నిరతికి సంకేతం సమ్మక్క సారలమ్మ జాతర. దేశంలో 9 శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ జాతరకు ఘనమైన నేపథ్యమే ఉంది. 12వ శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పొలవాస అటవీ క్షేత్రానికి నాయకుడు గిరిజన తెగకు చెందిన మేడరాజు. ఈయన అడవిలో దొరికిన శిశువును అమ్మవారి అనుగ్రహంగా భావించి సమ్మక్క(Sammakka) అని పేరు పెట్టి పెంచుకున్నాడు. యుక్త వయసు రాగానే మేనమామ పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశాడు. వీరి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు.

ములుగు జిల్లా, మేడారం ప్రాంతాన్ని పర్యాటక హబ్​గా మారుస్తాం : మంత్రి సీతక్క

Sammakka Saralamma Festival: ఒక సారి కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు(King Pratapa Rudra) రాజ్యకాంక్షతో పొలవాస మీద దండెత్తాడు. కాకతీయ సైన్యాల ధాటికి తట్టుకోలేని గిరిజనులు మేడారానికి తరలివెళ్లారు. మామ మేడరాజుకు అల్లుడు పగిడిద్దరాజు ఆశ్రయం ఇచ్చారు. అది నచ్చని కాకతీయ చక్రవర్తి మేడారంపై మెరుపుదాడి చేశాడు. గిరిజన సైన్యం ధీరత్వంతో ఎదుర్కొన్నా ఎక్కువ కాలం యుద్ధం చేయలేకపోయారు. సంపెంగ వాగు దగ్గర పగిడిద్ద రాజు, నాగులమ్మ, సారలమ్మభర్త గోవిందరాజు వీర మరణం పొందారు. ఆ పరాజయాలను తట్టుకోలేని జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగు(Jampanna Vagu)గా పిలుస్తున్నారు.

Sammakka Saralamma Details :కాకతీయులతో యుద్ధంలో అయినవాళ్లు వీర మరణం పొందినా సమ్మక్క, సారలమ్మలు మాత్రం యుద్ధంలో ధైర్యంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో సారలమ్మ కూడా నేలకొరిగింది. అయితే సమ్మక్కను నేరుగా ఎదుర్కోవడం అసాధ్యం అని తలచిన ప్రతాపరుద్రుని సేనలు వెన్నుపోటు పొడిచారు. చివరి క్షణం దాకా పోరాడుతూ సమ్మక్క చిలకల గుట్టపైకి వెళ్లింది. అక్కడి నాగమల్లి చెట్టు కింద ఓ కుంకుమ భరిణిలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి వెదురుకర్రగా ఆవిర్భవించిందని చెబుతారు. సమ్మక్క- సారలమ్మల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం అప్పటి నుంచి ఆచారంగా వస్తోంది.

ఈసారీ మేడారానికి హెలికాప్టర్​ సేవలు - 'ప్రత్యేక జాయ్‌ రైడ్‌' - టికెట్‌ ధరలు ఇవే

Sammakka Saralamma History :జాతర 1944 వరకూ ఆదివాసీలకే పరిమితమైనా క్రమంగా కులమతాలకు అతీతంగా జరుగుతోంది. సకల జనజాతరగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 1968 నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర ఘనంగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఝార్ఖండ్‌ల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. దీనికి తెలంగాణ కుంభమేళా అని కూడా పేరు.

సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేడారంలోని జువ్విచెట్టు కింద ఏర్పాటు చేసిన మహాపీఠంపై రెండు వెదురుకర్రలను సమ్మక్క- సారలమ్మలకు ప్రతీకగా ప్రతిష్ఠిస్తారు. సమ్మక్కకు ప్రతీకగా భావించే కుంకుమ భరిణిను పూజారులు చిలుకల గుట్ట నుంచి తీసుకువచ్చి వెదురుకర్రకు అలంకరించడం జాతరలో ప్రధాన ఘట్టం. దీన్నే ఆదిఘట్టం అంటారు. జాతర ప్రారంభం రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వస్తారు.

"భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకుని వెళ్లాలని ఆశిస్తున్నాం. ఎలాంటి రాజకీయ ప్రయాజనాలకు తోవలేదు. ప్రతి సామాన్యుడు ఉచితంగా అమ్మవారి దర్శించుకోవచ్చు. క్షేమంగా వచ్చి లాభంగా వెళ్లాలని కోరుతున్నాం."-కొండా సురేఖ, రాష్ట్ర మంత్రి

Medaram Jatara Second Day : రెండోవరోజు లక్షలాది భక్తులు ఆహ్వానం పలుకుతుండగా చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్కను కొక్కెర వంశస్థులు గద్దెల చెంతకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. రెండో రోజు కన్నెపల్లి మందిరం నుంచి సారలమ్మకు ప్రతిరూపమైన పసుపు భరిణిను మరో రెండు వెదురు కర్రకు పట్టు దారాలతో కడతారు. తల్లీబిడ్డల రూపాలకు కుంకుమ, పసుపులను నీళ్లలో కలిపి స్నాన వేడుకను నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణులైన ఇద్దరు తల్లులకు చీర సారెలను సమర్పిస్తారు. మూడో రోజైన మాఘ పౌర్ణమి నాడు నిండు జాతర పేరుతో నిర్వహించే ప్రధాన ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. నాలుగోరోజు సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

దారులన్నీ మేడారం వైపే - మహా జాతరకు పోటెత్తుతోన్న భక్త జనం - అమ్మవార్ల గద్దెల చెంత కోలాహలం

నెల రోజులు భక్తులతో కోలాహలం: సమ్మక్క సారలమ్మల పేరు చెబితే తప్పక గుర్తుకువచ్చేది బంగారంగా పిలిచే బెల్లం. శక్తిరూపాలైన సమ్మక్క సారలమ్మలకు ఈ బంగారాన్ని నివేదించడం సంప్రదాయం. భక్తులు తమ బరువుకు సరిపోయే బెల్లాన్ని మొక్కు కింద సమర్పిస్తారు. ఆ బెల్లాన్ని ప్రసాదం కింద తీసుకెళ్తారు. మాహా జాతర పూర్తైన తర్వాతి వారం నిర్వహించే వేడుకను తిరుగు వారం వేడుక అంటారు. నాలుగు రోజుల జాతరలో తప్పులు ఏమైనా జరిగితే క్షమించాలని అమ్మవారిని వేడుకుంటారు. తిరుగు వారం వేడుకతో మహాజాతర ముగుస్తుంది. జాతర నాలుగు రోజులు జరిగినా ఆ రోజులతో పాటు అంతకు ముందు, తర్వాత కూడా భక్తులు విచ్చేస్తుంటారు. దాదాపు ఫిబ్రవరి మాసం అంతా మేడారం సుమారు కోటి మంది విచ్చేసే భక్తులతో సందడిగా మారుతుంది. అటవీ ప్రాంతం కావడంతో సాధారణ సమయాల్లో నిర్మానుష్యంగా ఉండే మేడారం ఈ నెల రోజుల పాటు కిక్కిరిసిపోతుంది. సమ్మక్క సారలమ్మల త్యాగాలకు గుర్తుగానే మేడారం జాతర జరుగుతుందని జాతర నిర్వహిస్తేనే వారు అజరామరంగా ప్రజల మనసులో బతికే ఉంటారంటూ ఆదివాసులు చెబుతారు. రాజ్యాలు పోయిన రాజులు మారిన జాతర జరిగే ఆచారం మాత్రం కొనసాగుతూ వస్తోంది.

సమ్మక్కసారలమ్మ జాతర సందర్భంగా మేడారం ఊగిపోతుంది. జాతరకు విచ్చేసే భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి వన దేవతలను దర్శించుకుంటారు. కోళ్లు, మేకలను బలిచ్చి కోర్కెలు తీర్చాలని వేడుకుంటారు. శివసత్తులు నృత్యాలు చేస్తారు. జాతర సందర్భంగా ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు. భక్తులు గుడారాలు, లేదా ఆరు బయటే నిద్రిస్తారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమకొండ నుంచి మేడారం వరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు ప్రభుత‌్వం రూ.110 కోట్లు విడుదల చేసింది. మేడారం విచ్చేసే భక్తులు సమీపంలోని రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సులను కూడా సందర్శించే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేసింది.

భారత సంస్కృతికి ప్రతీక: ఆధునిక కాలంలో మానవుడు అత్యంత క్లిషమైన చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్‌లను దించగల మేధస్సునూ సంపాదించాడు. కాలం రోజురోజుకూ ఎంత ఆధునికత సంతరించుకుంటున్నా భారత్‌లో మాత్రం సంస్కృతీ సంప్రదాయాలు చెక్కుచెదరవు అనేందుకు నిదర్శనం సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Fair). ఇంతటి ఘన చరిత్ర కల్గిన ఈ జాతర దిగ్విజయంగా సాగిపోవాలి, ఆ అమ్మవార్ల దీవెనలు అందరికీ అందాలి.

మరో 6 రోజుల్లో మేడారం మహా జాతర - గద్దెలపై కొలువుదీరేందుకు సిద్ధమవుతున్న పగిడిద్దరాజు

ABOUT THE AUTHOR

...view details