Medaram Jatara 2024 Arrangements : సమ్మక్క - సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగొద్దనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రూ.110 కోట్లను మంజూరు చేశారు. తెలంగాణ మహా కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన అతిపెద్ద గిరిజన జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ప్రతిసారి భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 58 లక్షలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు రెండు కోట్ల మంది తల్లులను దర్శించుకోనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు.
భక్తుల తాకిడికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారంలో తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్లపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాగు నీరు, మరుగు దొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి, క్యూలైన్ ఏర్పాటు తదితర అనేక ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతరకు ముందు నుంచే ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తూ, అవసరమైన సూచనలు చేస్తూ వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించామని ఆమె తెలిపారు .
Medaram Prasadam Delivery through Online :12 వేల పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. 300 ఎల్ఈడీ (LED) స్క్రీన్లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను పర్యవేక్షించేందుకే 300 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు మేడారం విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల రవాణాకు ఆర్టీసీ ద్వారా 6000 బస్సులను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అటు సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని వారు అమ్మవారి ప్రసాదం పొందేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసింది. అనివార్య కారణాల వల్ల నేరుగా దర్శనం చేసుకోలేని వారికి మొక్కులు చెల్లించుకుని ప్రసాదం పొందే సౌకర్యం కల్పించింది. దేశంలోని అన్ని పోస్టల్ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.