Ground Based Learning In Medak :విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నాణ్యమైన విద్యను అందించాలనుకున్నారు ఆ కలెక్టర్. బట్టీ చదువులకు స్వస్తి పలికేందుకు నవంబర్ 14న ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో వారం ఒక సబ్జెక్ట్‌ని తీసుకుని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు పదును పెడుతున్నారు. తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే, నేరుగా గ్రౌండ్‌లో స్వీయ అనుభావాలతో పాఠాలు నేర్చుకోవడం మంచి అనుభూతినిస్తుందని చెబుతున్నారు విద్యార్థులు.
బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ : ఒంట బట్టని బట్టీ చదువులతో విసిగిపోతున్న విద్యార్థులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఊరట కల్పించారు. సాధారణ పద్ధతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలని కలెక్టర్ సంకల్పించారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మెదక్ గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
గణితంతో పాటు సైన్స్ పాఠాలు : ఈ పద్ధతి ద్వారా వెనకబడిన విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీసి లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులు గణితంతో పాటు సైన్స్ పాఠాలు అభ్యసిస్తున్నారు. ఎప్పటికప్పుడు సందేహాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకుంటున్నారు. తరగతి గదిలో నేర్చుకునే దాని కంటే గ్రౌండ్‌లో ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వల్ల ఎప్పటికీ గుర్తుంటుందని విద్యార్థులు చెబుతున్నారు.