TGSRTC Earned Record Revenue on Raksha Bandhan :రక్షాబంధన్ పర్వదినం సందర్బంగా రికార్డు స్థాయిలో 63 లక్షల మంది వరకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన సంస్థ సిబ్బంది, అధికారులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. సోదరభావానికి ప్రతీకైన రాఖీ పండుగను త్యాగం చేసి భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని వారి సేవలను ఆయన కొనియాడారు.
అత్యంత రద్దీలోనూ మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని, ఒక్కరోజే 41.74 లక్షల మంది మహిళామణులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేశారని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినం రోజున టీజీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయన్నారు. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, 19వ తేదీన 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయన్నారు.
రికార్డు స్థాయిలో ప్రయాణికులు - అధిక మొత్తంలో ఆర్టీసీ ఆదాయం :ఒక్కరోజులో మొత్తంగా 63 లక్షల మంది వరకు ప్రయాణించారన్నారు. అందులో అత్యధికంగా హైదరాబాద్ రీజియన్లో 12.91 లక్షలు, సికింద్రాబాద్ పరిధిలో 11.68 లక్షలు, కరీంనగర్ రీజియన్లో 6.37 లక్షలు, మహబూబ్‌నగర్ ప్రాంతంలో 5.84 లక్షలు, వరంగల్ రీజియన్లో 5.82 లక్షల మందిని బస్సులు గమ్యస్థానాలకు చేరవేశాయని ఎండీ సజ్జనార్ తెలిపారు. 97 డిపోలకు గాను 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియోను (ఓఆర్)నమోదు చేశాయన్నారు.