Three MBBS Students Missing at Jalatarangini Waterfall : అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతం వద్ద ప్రమాదం విషాదం చోటుచేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులలో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు జలపాతంలో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, యువకుడు ఉన్నారు. గల్లంతైన ముగ్గురిలో అమృత, సౌమ్య మృతదేహాలు లభ్యం అయ్యాయి. మొత్తం 14 మంది వైద్య విద్యార్థులు ఏలూరు నుంచి విహార యాత్రకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
మన్యంలో మామూలు రోజుల్లో వయ్యారంగా ఎంతో అందంగా ప్రవహించే కొండవాగులు, వర్షాలు కురిస్తే మాత్రం ‘కాలనాగులు’గా మారుతుంటాయి. గత రెండు నెలలుగా మారేడుమిల్లి ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొద్ది రోజుల ముందు వరకూ జలపాతాల సందర్శనపై ఆంక్షలు విధించారు. ఇటీవల వర్షాల తీవ్రత తగ్గడంతో సందర్శనకు అనుమతించారు. దీంతో పర్యాటకుల రాక క్రమంగా మొదలైంది.
విద్యార్థులు (ETV Bharat) ఈ క్రమంలోనే ఆదివారం ‘జలతరంగిణి’ జలపాతంలో సరదాగా గడిపేందుకు ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వచ్చారు. భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా జలపాతం ప్రవాహం ఉద్ధృతి పెరిగి, అయిదుగురు నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరిని అక్కడే ఉన్న తోటి పర్యాటకులు రక్షించారు. మిగిలిన ముగ్గురు విద్యార్థులు గల్లంతవడంతో విహార యాత్ర విషాదకరంగా మారింది. భారీ వర్షంతో ఒక్కసారిగా వాగు ఉప్పొంగడమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. వర్షాలు కురిస్తే మారేడుమిల్లిలోని పాములేరు, సోకులేరు వాగులతోపాటు జలపాతాలు, కొండవాగులు ప్రమాదకరంగా మారుతుంటాయి. గతంలోనూ అనేకమంది పర్యాటకులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.
కొనసాగుతున్న గాలింపు చర్యలు:మన్యంలోని పర్యటక ప్రదేశాల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపడతామని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వెల్లడించారు. మారేడుమిల్లి మండలంలోని జలతరంగిణి జలపాతంలో గల్లంతైన వైద్య విద్యార్థుల్లో సురక్షితంగా బయటపడి రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరిణిప్రియ, గాయత్రి పుష్పలను ఆమె పరామర్శించారు. వీరిలో హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ప్రకృతి అందాలను తిలకించడానికి వచ్చిన వైద్య విద్యార్ధులు గల్లంతవడం విచారకరమని ఎమ్మెల్యే అన్నారు. పర్యాటక ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు చేయాలని ఆదేశించారు. బాధిత విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ప్రమాదం గురించి పోలీసులకు ఎమ్మెల్యే సమాచారం అందించారు. జలపాతంలో గల్లంతైన ముగ్గురిలో, అమృత, సౌమ్య మృతదేహాలు లభ్యం కాగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వాగులో కొట్టుకుపోయిన బైక్- ప్రాణాలతో బయటపడిన నలుగురు యువకులు - Four Youths Escaped Safely