Four Sisters MBBS In Siddipet : తల్లి గొంతు క్యాన్సర్‌తో మరణించింది. తోడబుట్టిన అన్న అనారోగ్య సమస్యతో దూరమయ్యారు. ఆ సంఘటనలు ఆయనను కదిలించాయి. తన బిడ్డలను వైద్యులను చేయాలనే సంకల్పాన్ని మనసులో నాటాయి. నలుగురు ఆడపిల్లలు పుట్టినా నిరాశ చెందలేదు. ‘మిషన్ కుడుతూ ఇంతమందిని ఎలా పెంచిపోషిస్తావంటూ’ ఇరుగు పొరుగు, బంధువుల సూటిపోటి మాటలు బాధిస్తున్నా, వెనకడుగు వేయలేదు. తన రెక్కల కష్టంతో భార్య సహకారంతో నలుగురినీ చదివించారు.
సిద్దిపేటలోని నర్సాపూర్ కాలనీకి చెందిన రామచంద్రం (శేఖర్), శారద. వీరికి మమత, మాధురి, రోహిణి, రోషిణి నలుగురు పిల్లలు. వృత్తి నైపుణ్యంతో రెక్కల కష్టాన్ని నమ్ముకొని సంపాదించిన ఒక్కో రూపాయి పోగేసి నలుగురు పిల్లల్ని చదివించారు. పిల్లలు కూడా తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకుని చదువులో పోటీపడ్డారు. ఇద్దరు వైద్య విద్య కొనసాగిస్తుండగా, మరో ఇద్దరు తాజాగా ఎంబీబీఎస్‌లో చేరి ‘మా ఇల్లు తెల్లకోటుకు పుట్టినిల్లు’ అని నిరూపించారు. నలుగురు అక్కాచెల్లెళ్లు సాగించిన చదువుల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఇంకెన్నో బాధలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించారో ఇటీవలే వైద్య విద్యలో ప్రవేశం పొందిన కవలలైన రోహిణి, రోషిణి మాటల్లో తెలుసుకుందాం.
నాన్న కలల్ని సాకారం చేసిన అక్కాచెళ్లెల్లు :తొలుత అక్క మమత నాన్న కలల్ని సాకారం చేసే సౌధానికి బలమైన పునాది వేసిందని రోహీణి, రోషిణి వివరించారు. తాను ఎంతో కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుందన్నారు. హైదరాబాద్‌లో ఇంటర్ చదివిందన్నారు. విజయవాడలో ఏడాది లాంగ్‌టర్మ్ శిక్షణ తీసుకుని నీట్‌లో ర్యాంకు సాధించి విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిందన్నారు.
అక్క స్ఫూర్తితో చిన్నక్క మాధురి వైద్య వృత్తి చేపట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అన్నారు. చదివే సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తినా, పట్టువదల్లేదని ఏడాది పాటు లాంట్‌టర్మ్ శిక్షణ తీసుకుని నీట్‌లో ర్యాంకు సాధించిందన్నారు. కన్వీనర్ కోటాలో కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిందని తెలిపారు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోందని, అక్కలు ఇచ్చిన ప్రోత్సాహంతో తామిద్దరమూ వైద్య విద్యనే ఎంచుకోవాలనుకున్నామని తెలిపారు.