Mazda Art Festival Show in Hyderabad :కళ ఎవరికి నచ్చదు చెప్పండి. కంటి ముందు సుందరమైన దృశ్యాలు విందు చేస్తుంటే అలా రెప్పవేయకుండా చూడాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి సుందర దృశ్యాలను కళ్లకు కట్టేది కళే. మనసులోని భావాలను అందంగా మనసు నచ్చిలా హృదయానికి హత్తుకునేలా వివరించే శక్తి ఒక్క కళకే ఉంటుంది. ముఖ్యంగా కాన్వాస్‌పై భిన్న రంగులతో కళాకారులు చేసే మ్యాజిక్ చూపరులను మంత్ర ముగ్దులను చేస్తుంది. అలాంటి దాదాపు 200లకు పైగా అద్భుతమైన పెయింటింగ్స్‌ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చింది మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ 2024.
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మజ్దా ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆర్ట్ ఫెస్టివల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. మొత్తం 7 గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మూడు రోజలపాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో పలువురు ప్రముఖ ఆర్టిస్ట్‌లు లైవ్ సెషన్లు సైతం నిర్వహించనున్నారు. వాటర్ పెయింటింగ్స్‌లో ప్రఫుల్ సావంత్, పెన్సిల్ రెండరింగ్ టెక్నిక్‌లో సదాశివ్ సావంత్ వంటి ప్రముఖులు లైవ్ డెమోలను ఇవ్వనుండటం విశేషం. చిత్రకళవైపు రావాలనుకునే వారికి ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిర్వాహకులు.
'వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు ఇక్కడికి వచ్చారు. చిత్రకళవైపు రావాలనుకునే వారికి ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది ఆర్ట్ గ్యాలరీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కళాకారులతో పెయింటింగ్స్ గురించి తెలుసుకోవచ్చు'-నిర్వాహకులు
ఔరా అనిపిస్తున్న అందమైన పెయింటింగ్స్ :స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరిన ఈ అందమైన పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక్కో ఆర్టిస్ట్ ఒక్కో రకంగా తన కలలకు రూపం ఇచ్చారు. ముఖ్యంగా ఆక్రిలిక్ మౌల్డ్స్, ఆయిల్ పెయింటింగ్స్, బైక్ పార్ట్స్‌పై చేసిన పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక పెన్సిల్‌తో గీసిన సుందరమైన బొమ్మలు, చెక్కను కాలుస్తూ చేసిన ఆర్ట్స్, పెన్ ఆన్ పేపర్, క్యాండిల్‌తో కాల్చి చేసిన బొమ్మలు ఔరా అనిపిస్తున్నాయి. కేవలం 17 ఏళ్ల వయసున్న చిన్నారి మొదలు 70 ఏళ్ల వరకు వివిధ వయసుల్లో ఉన్న వారు ఇక్కడ తమ పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్నారు.
పెయింటింగ్స్‌ను సైతం కొనుగోలు చేయవచ్చు :ఈ గ్రూప్ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ముంబయి వంటి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో వచ్చి తాము గీసిన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. అంతేకాదు ఆసక్తి ఉన్న వారు కేవలం చిత్రాలను చూడటమే కాకుండా కొనుగోలు చేసేందుకు వీలుగా ఇక్కడ ఎగ్జిబిషన్‌తో పాటు సేల్‌ను నిర్వహిస్తుండటం విశేషం. ఓల్డ్ ఏజ్, మోడ్రన్, రియలిస్టిక్, మౌల్డ్ వంటి వివిధ రకాల కళాకృతులు ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావటంతో ఎంతో మంది కళాప్రియులు ఆర్ట్ గ్యాలరీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. శని, ఆదివారాల్లో కొనసాగనున్న మజ్దా ఆర్ట్ ఫెస్టివల్లో చిన్నా పెద్దా అంతా అందమైన పెయింటింగ్స్‌ను చూడటంతోపాటు కొత్త కొత్త టెక్నిక్స్‌ను నేర్చుకోవచ్చంటున్నారు నిర్వాహకులు. ఆసక్తి ఉన్న వారు పెయింటింగ్స్ సైతం కొనుగోలు చేయవచ్చని ఎగ్జిబిషన్‌కు వచ్చేందుకు ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదని వివరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఆర్టిక్స్ ఎగ్జిబిషన్ 2024 - కళలను ప్రపంచస్థాయిలో చాటి చెప్పేలా ప్రదర్శన