Massive Fraud in Peddapalli Post Office :ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్‌లలో ప్రవేశ పెట్టిన పొదుపు స్కీమ్స్‌లో చాలా మంది చేరుతున్నారు. ప్రభుత్వ సంస్థ అని అందులో పొదుపు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, భవిష్యత్తులో పిల్లల జీవితాలకు ఒక భరోసా ఉంటుందని స్కీమ్‌లలో చేరి డబ్బులు జమ చేస్తున్నారు. ఒక్కసారి పిల్లల పేర్లపై ఫిక్స్ డిపాజిట్ చేస్తే భవిష్యత్తులో ఒకేసారి ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో వారి చదువులకో, లేక పెళ్లికో ఉపయోగపడతాయని భావించి లక్షల కొద్ది డబ్బును స్కీమ్ కింద డిపాజిట్ చేస్తున్నారు. చేసిన కష్టాన్ని పిల్లల జీవితాల కోసం వెచ్చిస్తున్నారు. అలాంటి వారిని బురిడి కొట్టించి అయామక ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల : మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామపంచాయతీలోని తపాల శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగిని స్థానిక ప్రజలకు కొన్ని పథకాల గురించి తెలియజేసింది. ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే భవిష్యత్తులో మీ అవసరాలకు, పిల్లల చదువులకు, పెళ్లిలకు ఉపయోగపడతాయని నమ్మబలికింది. అలా అందరిని నమ్మించి లక్షల కొద్ది డబ్బులు డిపాజిట్ చేయించుకుని నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి వారికిచ్చింది. డిపాజిట్ చేసిన డబ్బులు స్వాహా చేసింది.
వైరల్ వీడియో - అమెజాన్‌లో ల్యాప్‌టాప్ బుక్ చేస్తే నాపరాయి వచ్చింది - బాధితుడు ఏం చేశాడంటే ?
ఇలా వెలుగులోకి : అయితే ఇటీవల బదిలీపై వచ్చిన సబ్ పోస్ట్ మాస్టర్ శివకుమార్‌కు పలు ఖాతాలపై అనుమానం వచ్చింది. ఏంటా అని కొంతమంది ఖాతాదారులను పిలిపించి వారి పాస్ పుస్తకాలను పరిశీలించగా నకిలీవని బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు అందరూ ఆఫీస్ దగ్గరకు వచ్చి వారు జమ చేసిన డబ్బులు అకౌంట్‌లో ఉన్నాయా లేదా అని చెక్ చేయగా కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురై మహిళా అధికారిణి ప్రశ్నించగా చేసిన తప్పు ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంలో మరొకరి పేరుందని తెలిపారు.