Many Farmers are Committing Suicide due to Land Issues :ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ సమస్యలు పరిష్కారం కాక ఆవేదనతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భూ సమస్య పరిష్కరించాల్సిన కొందరు తహసీల్దార్లే వివాదాలను సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన అనేక భూ సమస్యలను జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వేదికకు వందలాదిగా బాధిత రైతులు భూ సమస్యలతోనే వస్తున్నారు. సమస్య పరిష్కారానికి కలెక్టరేట్ల నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు వెళ్లినా పట్టించుకోవడం లేదు. కొంతమంది తహసీల్దార్లు సమస్యను పరిష్కరించకపోగా బాధితులను బెదిరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సమస్యలను పరిష్కరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రాణాలు తీసుకోడానికి సైతం సిద్ధపడుతున్న పరిస్థితి నెలకొంది.
అర్జీలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి : భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినా ఆమేరకు చిత్తశుద్ధి మండలస్థాయి రెవెన్యూ అధికారుల్లో కనిపించడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక మండలాల్లో రికార్డులను తారుమారు చేసి అమాయకమైన రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఎన్నో సంఘటనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో భూ సమస్యల పరిష్కారం కోసం అప్పటి స్పందనలో కలెక్టర్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ రోజూ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించలేదు. సమస్యను పరిష్కరించకుండానే బాధితులకు న్యాయం చేశామని రికార్డుల్లో రాసుకొని గ్రీవెన్స్ ను మూసేసిన బాధ్యతరాహిత్య పరిస్థితులు కూడా బాధిత రైతులు చూడాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో చేసిన పాపాలతో నేటికీ రైతులు కలెక్టర్ల చుట్టూ అర్జీలు పట్టుకొని తిరగాల్సి వస్తోంది.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం- త్వరలో మ్యాపింగ్ సిద్ధం: ఆర్పీ సిసోదియా - visakha land issues
బలవంతుడి పక్షాన నిలబడుతున్నారు : గ్రామాల్లో తలెత్తే భూ సమస్యల్లో 70 శాతంపైగా తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం చేయగలుగుతారు. అయితే వివాదాన్ని రెవెన్యూ అధికారులే మరింతగా పెంచుతూ, బలవంతుడి పక్షాన నిలబడుతున్నారనే విమర్శులున్నాయి. అన్నదమ్మల మధ్య భూ వివాదాలు, వ్యవసాయ క్షేత్రాలకు దారి సమస్యలు, సరిహద్దు వివాదాలు ఇలాంటివన్నీ తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంది. సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధపడని చాలా మంది తహసీల్దార్లు రికార్డులు లేవని, అగ్నిప్రమాదంలో కాలిపోయాయని కుంటిసాకులు చెబుతూ బాధితుల సంఖ్యను పెంచుతున్నారు.
సమస్యలు పరిష్కారం కావడంలేదు : కలెక్టర్ వద్దకు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం మేర తహసీల్దార్లు చేస్తున్న తప్పుల వల్ల బాధితులుగా మిగిలిపోయిన వారివే ఉంటున్నాయి. రాత్రికి రాత్రి భూ యాజమాన్య హక్కులను మార్చేయడం, అక్రమంగా మరొకరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం వంటి అనేక అక్రమాలు గత ఐదేళ్లలో వందలాదిగా వెలుగుచూశాయి. రెవెన్యూ రికార్డులనే మార్చేస్తున్న కొందరు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలున్నాయి. సంవత్సరాల తరబడి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.