Heavy Rains in Rayalaseema Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.
విస్తారంగా వర్షాలు :వాయుగుండం ప్రభావంతో వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానజల్లులు కురుస్తున్నాయి. కడప జిల్లా జలదిగ్బంధమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఉన్న ప్రాంతంతో పాటు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో నిండిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
జలమయమైన రహదారులు : వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండగా జిల్లాలోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కమలాపురంలో రోడ్లన్నీ జలమయమయ్యాయ. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వరదనీ రు చేరింది. పులివెందుల నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వరి, అరటి, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతన్నలు వాపోయారు. ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, వేంపల్లె, కడప మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 90 మిల్లీమీటర్లమేర వర్షం కురిసింది. జమ్మలముడుగు నియోజకవర్గంలోనూ వర్షాలు దంచికొట్టాయి. గండికోట జలాయశం నుంచి మైలవరానికి, అక్కడి నుంచి నాలుగుగేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని దిగువకు విడుదల చేశారు.