Manhole Filled With chemical waste In Jeedimetla :అక్కడ హత్యలు.. రోడ్డు ప్రమాదాలు జరగలేదు. కానీ ఆ దారుల్లో ఎరుపు రంగుతో నీరు వరదలా ప్రవహించింది. చూసేందుకు రక్తం మాదిరే ఉంటంతో ఏంటా ఎరుపు రంగు అని స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరైనా ఎక్కడైనా హత్యకు గురయ్యారా లేక జంతువుల వధ నిర్వహించారా అని ఆలోచనలో పడ్డారు. చూస్తూ ఉంటే అక్కడ ప్రజలు భరించలేని దుర్గంతమైన వాసన వెలువడింది. ఏంటా వాసన అని.. ఊపిరిసడలక ముక్కు మూసుకున్నారు. చివరికి విషయం తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నా.. వాసన మాత్రం భరించలేకపోయారు. ఇంతకీ ఎరుపు రంగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
గోదాముల రసాయనాలు : హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రినగర్‌లో సోమవారం సాయంత్రం మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. ఆ నీరు రెండు రోడ్లలో పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో నివాసితులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంతకీ ఏంటా ఎరుపు రంగు అని, ఎక్కడి నుంచి వస్తుందోనని ఎరుపు రంగు పారిన రోడ్డు వెంబడి కొందరు వెళ్లారు.
మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు : కాలనీలో కొంతమంది రీసైక్లింగ్ పరిశ్రమలను నిర్వహిస్తూ రసాయనాల డ్రమ్ములను కడిగి నాలాల్లో పారబోయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని అనుమతులు లేకుండా ఇండ్ల మధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.