Manchu Vishnu Press Meet in Hospital : నిన్న జల్పల్లిలోని తమ నివాసంలో జరిగిన ఘర్షణలో రిపోర్టర్‌పై దాడి జరగడం దురదృష్టకరమని మంచు విష్ణు తెలిపారు. గత రెండు రోజులుగా తమ కుటుంబంలో తారాస్థాయికి చేరిన వివాదంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని, తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని ఆయన ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ప్రేమతో గెలవాలని, రచ్చతో కాదని తన తమ్ముడిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
జర్నలిస్ట్‌పై దాడి దురదృష్టకరం :ఈ ఘర్షణలో ఓ జర్నలిస్టుకు గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం(డిసెంబరు 11)న జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, తన తండ్రి మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని, ఓ మీడియా ఛానల్ రిపోర్టర్ మైకును మొహం మీద పెట్టడంతో ఆవేశంలో కొట్టారని అన్నారు. వాస్తవానికి అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో మోహన్ బాబుకు కూడా కొన్ని గాయాలయినట్లు తెలిపారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మంచు విష్ణు స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు.
మీడియాకు ముందే లీకులు :భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కన్నప్ప సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ మీద లాస్‌ఏంజెల్స్‌లో ఉండగా ఫోన్ వచ్చినట్లు విష్ణు మీడియాకు తెలిపారు. దీంతో వెంటనే అమెరికా నుంచి హుటాహుటిన బయలుదేరి వచ్చినట్లు చెప్పారు. తమకు పోలీసుల నోటీసులు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుపాకిని సరెండర్ చేయాలని ఆదేశించినట్లు మీడియాలోనే వచ్చిందని అన్నారు. ఈ అంశంపై ఇవాళ ఉదయం 10.30 గంటలకు తనకు నోటీసులు అందినట్లు వెల్లడించారు.