Man Who Cheated Jeweller In Hyderabad : మెడలో గొలుసు, వేళ్లకు ఉంగరాలు, చేతికి బ్రాస్లెట్ ధరించి సంపన్నవంతుడిగా కనిపిస్తాడు. బీఎండబ్ల్యూ కారులో స్టైల్‌గా దుకాణానికి వస్తాడు. టిప్‌టాప్‌గా షాపులోకి ప్రవేశించి బంగారం వ్యాపారితో పరిచయం పెంచుకుంటాడు. తనకు విల్లాలు ఉన్నాయని, కోటీశ్వరుడినని చెప్పి వ్యాపారులను బుట్టలో వేసుకుని లక్షల ఖరీదు చేసే డైమండ్ నగలు ఎంపిక చేసి దానికి తగిన నకిలీ చెక్కు ఇచ్చి అక్కడి నుంచి జారుకుంటాడు. తమని మోసగించాడు అని షాపు వారు తెలుసుకునేంతలోనే అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటే పొరపాటే ఇది యదార్థ గాథ.
ఇదీ జరిగింది :జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్-36లోని ఓ ఆభరణాల దుకాణానికి గత జూన్ 20వ తేదీన సుమన్ గుంటి అనే వ్యక్తి వచ్చి రూ.4.12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి చెక్కు ఇచ్చి పసిడి ఆభరణాలను తీసుకువెళ్లాడు. ఆభరణాల వ్యాపారి అజుగుప్తా ఆ చెక్కును విత్‌డ్రా చేసేందుకు బ్యాంకులో వేయగా అకౌంట్ బ్లాక్‌లో ఉందని వారు తిరిగి పంపించారు.
దీంతో వ్యాపారి నిందితుడికి ఫోన్ చేశాడు. రెండు రోజుల్లో డబ్బులు పంపిస్తానని సదరు వ్యక్తి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగానే ఈ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు సుమన్ గుంటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెల్లని చెక్కులు ఇచ్చి మోసగిస్తూ :చెల్లని చెక్కులు ఇచ్చి బంగారు వర్తకులను మోసగిస్తూ లక్షలాది రూపాయలు విలువ చేసే వజ్రాభరణాలతో ఉడాయించిన ఘరానా కేటుగాడు సుమన్ గుంటిపై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కేసు నమోదైంది. రోడ్డునెంబ ర్-2లోని లుంబినీమాల్లో ఉన్న తివారుమల్ నగల షాపు వ్యాపారి సందీప్ అగర్వాల్‌ను మోసగించి పెద్ద ఎత్తున నగలతో జారుకున్నాడు.