Airport Construction in Warangal :నిజాం కాలంలో వాయుదూత్ విమానాలు నడిచి భారత్ చైనా యుద్ధ సమయంలో కీలక సేవలు అందించింది. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు రానున్నాయి. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడుస్తున్న ఈ విమానాశ్రం నుంచి మళ్లీ విమానం ఎగిరే రోజులు త్వరలోనే రానున్నాయి. వరంగల్ అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఈ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. కొన్నేళ్లుగా ముందుకా, వెనక్కా అన్నట్లు సాగిన నిర్మాణాన్ని నయా సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అత్యంత కీలకమైన భూసేకరణ కోసం నిధులు మంజురు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో విమానయానం చేయాలన్న ఓరుగల్లు వాసుల కల సాకారం కాబోతుంది.
విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి అంటే 949.14 ఎకరాల భూమి అవసరం. ప్రస్తుతం 696.14 ఎకరాలు ఉంది. దానికి అదనంగా కావాల్సిన మరో 253 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. భూ నిర్వాసితులకు పరిహారం, ఇతరత్రా వాటి కోసం తాజాగా ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో విమానాశ్రయం డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉత్తర్వులు జారీ చేయనుంది.
భయపెడుతోన్న 'శంషాబాద్ ఎయిర్పోర్ట్' - 3 వారాలుగా అసలు ఏం జరుగుతోంది?
ఎన్నో అభివృద్ధి పనులు : హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా వరంగల్ పేరొంది, అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కాకతీయ మెగాజౌళి పార్కు ఏర్పాటు ఐటీ పరిశ్రమలు, యునెస్కోతో రామప్ప అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం ఇలా ఒక్కొక్కటిగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వస్తూ ఓరుగల్లు అభివృద్ధి చెందుతోంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న తరుణంలో అభివృద్ధి చేసే పనులు నగరంలో సాగుతుండడంతో ప్రజలు హర్షిస్తున్నారు.