ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో మలుపు - ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్​రావు - బ్లూకార్నర్ నోటీసు జారీ అనుమానమే - PRABHAKAR RAO IN PHONE TAPPING CASE

Telangana Phone Tapping Case Updates : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో హైదరాబాద్‌ రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అరైస్టయిన నలుగురు అధికారుల వాంగ్మూలాలు, కొన్ని ధ్వంసమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు మినహా ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించట్లేదు. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులను విచారించి, కేసును కొలిక్కి తేవాలని అధికారులు పట్టుదలగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం సహకరించట్లేదు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 9:50 AM IST

telangana_phone_tapping_case_updates
telangana_phone_tapping_case_updates (ETV Bharat)

No Progress in Telangana Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై నాలుగు నెలలు కావొస్తున్నా దర్యాప్తులో మాత్రం ఆశించిన పురోగతి కనిపించట్లేదు. ప్రధాన నిందితుడైన ఎస్​ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు విదేశాల్లో ఉండటమే జాప్యానికి కారణం. దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన అంశాల ఆధారంగా ప్రభాకర్‌రావు ముఠా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడింది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొచ్చనే వెసులుబాటును అడ్డుపెట్టుకొని ప్రభాకర్​రావు చెలరేగిపోయారు.

హైకోర్టు న్యాయమూర్తితోపాటు ఆయన భార్య, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి వంటి సీనియర్ అధికారి ఫోన్లను సైతం ట్యాపింగ్‌ చేయడమే ఇందుకు ఉదాహరణ. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపైనా నిఘా పెట్టారంటే దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్ధమవుతోంది. ట్యాపింగ్‌ కేసు తీవ్రంగా ఉన్నప్పటికీ దర్యాప్తు మాత్రం ఊహించిన స్థాయిలో ముందుకు సాగట్లేదు. ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగి వచ్చేదాకా కేసులో పురోగతి ఉండే అవకాశం లేదు.

వైద్య చికిత్స కోసం ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిన తర్వాత ఆయన బాగోతం బయటపడింది. దాంతో తాను పారిపోలేదని, జూన్ 26 నాటికి తిరిగి వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో ఆయన తరఫున మెమో దాఖలు చేయించారు. చెప్పిన గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందని, రెండు రోజుల క్రితం అధికారులకు ఈ-మెయిల్‌ ద్వారా ప్రభాకర్‌రావు సమాచారమిచ్చారు. ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు ప్రభాకర్​రావుపై బ్లూకార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక పోలీసులు పంపించిన విజ్ఞప్తి సీబీఐ వద్దనే ఇంకా పెండింగ్‌లో ఉంది.

బ్లూకార్నర్ నోటీసు జారీ అనుమానమే : ఇది ఇంటర్‌పోల్‌కి వెళ్లడానికి, దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అన్నింటికీ మించి కేసు నమోదు కాకముందే ప్రభాకర్​రావు దేశం దాటేశారు. అంతకు ముందు సైతం చికిత్స కోసం పలుమార్లు విదేశాలకు వెళ్లారు. ఈ కారణంగా ఆయన పరారీలో ఉన్నారని నిర్ధారించడం అంత సులభం కాదు. పరారీలో లేనప్పుడు ఇంటర్‌పోల్ లాంటి సంస్థ, బ్లూకార్నర్ నోటీసు ఇచ్చేందుకు అంగీకరిస్తోందో లేదో అన్నది అనుమానమే. దీంతో ప్రభాకర్​రావు ఇప్పట్లో తిరిగి రావడం, రప్పించడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు.

దర్యాప్తు అధికారులు మరో ప్రయత్నంగా ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును జప్తు చేయాలని రీజినల్ పాస్‌పోర్టు అధికారికి లేఖ రాశారు. విదేశాల్లో దాగిన నిందితులను రప్పించేందుకు ఇదో మార్గం. ఎర్రచందనం స్మగ్లర్ ఎర్ర గంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు. కానీ ప్రభాకర్​రావు పాస్‌పోర్టు రద్దు చేయించడం, అంత సులభంగా అయ్యేలా కనిపించట్లేదు.

తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని, పారిపోలేదని, దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నానని వాదించే పక్షంలో ఆయన పాస్‌పోర్టు రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు. ఎలా చూసినా ప్రభాకర్‌రావు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో దర్యాప్తు పురోగతిపైనా అయోమయం నెలకొంది. ఇక విదేశాల్లో ఉన్న మరో నిందితుడు శ్రవణ్‌రావు సైతం ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పట్లో వేగం పుంజుకునేలా లేదు.

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, నేతలు - నిన్నటి వరకు కాల్స్‌లో మాట్లాడాలన్నా భయమే - Officers and leaders got Freedom

ఫోన్​ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ - 'బీఆర్ఎస్ నేతల సూచనతో సెటిల్​మెంట్లు' - BHUJANGARAO ON PHONE TAPPING

ABOUT THE AUTHOR

...view details