Farmers Crop Loans Issue In Mahabubnagar : ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేసింది. కాని ఆ డబ్బు రైతుల ఖాతాల్లో జమయ్యేందుకు మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక సాంకేతిక ఇబ్బందుల కారణంగా అర్హులైన రైతులకు ఇప్పటివరకూ రుణమాఫీ అమలు కాని పరిస్థితి నెలకొంది. మహబూబ్ నగర్ డీసీసీబీ పరిధిలో లక్షలోపు రుణాలున్న వాళ్లు 51వేల మంది ఉన్నారు. వారికి రూ. 236 కోట్ల వరకూ మాఫీ కావాలి. కాని ఇప్పటి వరకూ అయ్యింది కేవలం రూ.92 కోట్లు మాత్రమే.
లక్షలోపు రుణాలున్న సుమారు 30వేల మంది రైతులకు ఇంకా మాఫీ డబ్బులు చేరలేదు. ఇక లక్షన్నర లోపు 11వేల మందికి రూ.130 కోట్లు మాఫీ కావాలి. కానీ 9,500 మందికి రూ.68 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. ఇంకా రూ.60 కోట్లు వరకూ జమకావాల్సి ఉంది. ఎందుకీ పరిస్థితి ఏర్పడిందంటే అందుకు అనేక కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెబుతున్నారు.
అన్నదాతలు అధైర్యపడవద్దని వ్యవసాయ అధికారుల భరోసా : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, సుమారు రూ. 14కోట్ల రుణాలు రైతులకు అందకుండా పోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 28 పీఏసీఎస్‌లలో 1,677 మంది రైతులు తీసుకున్న రుణాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయడంలో సిబ్బంది జాప్యం చేశారు. నిర్దేషిత కాలపరిమితిలో వారి సమాచారం కంప్యూటర్లలో నమోదు కాకపోవడంతో వారికి రుణమాఫీ అందలేదు.
"కొందరు రైతుల ఖాతాకు సంబంధించి పంట రుణమాఫీలో కొంతమంది కుటుంబ నిర్ధారణ జరగలేదని తెలుస్తోంది. అయినప్పటికీ వాటిని కూడా ప్రభుత్వ గుర్తిస్తుంది. ఫ్యామిలీ మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఆధార్ సంఖ్య నమోదులో తప్పులు దొర్లడం, రుణ నమోదులో దోషాలు ఉన్నాయి." -మిథున్ చక్రవర్తి, వ్యవసాయ అధికారి, మక్తల్ మండలం