ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండలో మహా శివరాత్రి - ప్రభల వేడుకకు సర్వం సిద్ధం - KOTAPPAKONDA MAHA SHIVARATRI

కోటప్పకొండ ప్రభల వేడుకకు సిద్ధమైన పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలు - సిద్ధమైన 90 నుంచి 100 అడుగుల ఎత్తైన భారీ విద్యుత్ ప్రభలు

Kotappakonda_Maha_Shivaratri
Kotappakonda_Maha_Shivaratri (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 9:45 AM IST

Maha Shivaratri Celebrations in Kotappakonda:పల్లెలకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి. కానీ పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలకు అసలైన పండుగ మాత్రం శివరాత్రే. నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ మీద కొలువై ఉన్న పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు వివిధ రూపాల్లో పూజలు చేస్తారు. కానీ ఇక్కడి పరిసర గ్రామాల ప్రజలు మాత్రం కోటప్పకొండ కోటయ్యకు 90 నుంచి 100 అడుగుల ఎత్తైన భారీ విద్యుత్ ప్రభలు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. గ్రామాలన్నీ ఏకమై ఎన్ని వ్యయ ప్రయాసలు ఉన్నా లెక్క చేయక దాదాపు నెలరోజులు కష్టపడి సిద్ధం చేసిన ప్రభలు కొండకు తరలిస్తారు. శివరాత్రి రోజున కొండ కింద రాత్రంతా జాగరణ చేస్తారు. శివరాత్రి సందర్భంగా విద్యుత్ ప్రభల నడుమ వెలిగిపోయే ఆ శివయ్య వైభవం చూసి తీరాల్సిందే.

ప్రభలకు వందల ఏళ్ల నాటి చరిత్ర:పరమశివుడు త్రికోటేశ్వరుడిగా కొలువై ఉన్న దివ్యక్షేత్రం పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ. శివరాత్రి సందర్భంగా పూజలు, ఆరాధనలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా ఘనంగా జరిగినా ప్రభల వేడుకలలో మాత్రం కోటప్పకొండది ప్రత్యేకత. ఇక్కడి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. అత్యంత ఎత్తైన ప్రభలు లేకుండా కోటప్పకొండ తిరునాళ్లు జరిగినట్లు చరిత్రలో ఆనవాళ్లు లేవు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని ఏటా సమీప గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వెళుతుంటారు. విద్యుత్ ప్రభలను గ్రామస్థులు ఎంతో శ్రమపడి శోభాయమానంగా నిర్మిస్తుంటారు. ఒక్కో దాని నిర్మాణానికి 25 నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఈ ప్రభల వైభవానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. శివరాత్రి వచ్చిందంటే చిలకలూరిపేట, నరసరావుపేట మండలాల్లో సందడి నెలకొంటుంది. గ్రామస్థులందరూ కుల, మతాలకు అతీతంగా ప్రభల తయారీలో పాల్గొంటారు.

కోటప్పకొండ మహా శివరాత్రి - ప్రభల వేడుకకు సర్వం సిద్ధం (ETV Bharat)

ఎత్తైన భారీ విద్యుత్ ప్రభలు:త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రమూలల నుంచి వచ్చే లక్షలాదిమంది భక్తుల చూపు స్వామి వారి తరువాత ఉండేది నింగిని తాకేలా నిర్మించే విద్యుత్ ప్రభల మీదనే. పడవపై తెరచాప మాదిరిగా 80 నుంచి 90 అడుగుల ఎత్తున నిర్మించిన ప్రభలు విశేషంగా ఆకర్షిస్తాయి. భారీ కలప, వెదురు బొంగులు, వేలాది విద్యుత్ బల్బులతో అమర్చే ప్రభలు శివరాత్రి వేళ తళుక్కుమంటూ కాంతులీనుతాయి. ఈ ఏడాది చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, యడవల్లి, కోమటినేని వారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, అవిశాయపాలెం, కేసానుపల్లి, అబ్బాపురం నుంచి భారీ ప్రభలు కోటప్పకొండకు రానున్నాయి. కొండ కింద రాత్రంతా జాగరణ చేస్తూ విద్యుత్ ప్రభల వద్ద వివిధ సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోటొక్క ప్రభలను సమర్పిస్తే కోటయ్య కొండదిగి వచ్చి తమ గ్రామాలను, కుటుంబాలను చల్లగా చూస్తాడని స్థానికుల నమ్మకం. అందుకే తూచ తప్పకుండా ఏటా ఈ గ్రామాల ప్రజలు ప్రభలను కోటప్పకొండకు తీసుకువస్తున్నారు.

1008 కిలోల లడ్డూ బూందీతో శివలింగం - పెన్సిల్​ మొనపై శివతాండవం

పండగ వాతావరణంలో మహోత్సవం: ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల రోజుల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు. ప్రభలకు సంబంధించిన ఇరుసులు, రాతిచక్రాలు, డొలుపులు, కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం క్రేన్‌ సాయంతో ఏర్పాటు చేసిన రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు. వీటి ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తు ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్తు దీపాల ఏర్పాటు, జనరేటర్‌ తదితర సౌకర్యాలు 3 సార్లు ఏర్పాటు చేసినందుకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, భోజనాలకు, ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చేవరకు ఖర్చు ఉంటుంది. ప్రభ కొండకు బయలుదేరే ముందు గ్రామంలో, కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు, తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

కావూరు ప్రభకు ప్రత్యేక స్థానం:కోటప్పకొండ తిరునాళ్లలో చిలకలూరిపేట మండలం కావూరు ప్రభకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రామస్థులు వందేళ్ల ముందు నుంచే చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. 79 ఏళ్లుగా విద్యుత్తు ప్రభ నిర్మించి కోటప్పకొండకు తరలిస్తున్నారు. కావూరులో ప్రభ నిలిపేందుకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజావారు కొండ వద్ద ప్రత్యేక స్థలం ఇవ్వడంతో పాటు 50 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నందుకు అక్కడ ప్రత్యేక శిలాశాసనం కూడా వేయించారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో విజయవాడలో నిర్వహించిన మొదటి మహానాడులో కావూరు వాసులు అక్కడ తమ ప్రభ నిర్మించి ప్రత్యేకత చాటారు. ప్రభ నిర్మాణాన్ని ఏటా గ్రామంలో ఉన్న 6 ముఠాలలో ఒక ముఠా చేపడుతుంది. కేతినేని, మద్దాలి, కోడె, రామలింగం, మేండ్రు, నాయుడు ముఠాలు ఏటా ప్రభ బాధ్యత తీసుకుంటాయి. ఈ ముఠాలో ఉన్న రైతులకు 300 ఎకరాల భూములు ఉన్నాయి. ఎకరాకు ఇంత అని చెప్పి వసూలు చేసి ప్రభకు కేటాయిస్తారు.

కోటప్పకొండలో ఘనంగా ఏకాదశి వేడుకలు - పోటెత్తిన భక్తులు

ఒకేచోట 10 ప్రభలు నిర్మాణం: కమ్మవారిపాలెం, యడవల్లి, గోవిందపురం, బొప్పూడి, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, నరసరావుపేట మండలంలోని గురవాయపాలెం, యలమంద, నరసరావుపేట పట్టణం నుంచి కూడా విద్యుత్, చెక్కలతో చేసిన ప్రభలను పెద్దఎత్తున కోటయ్యస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు నిర్మిస్తుంటారు. మద్దిరాల గ్రామ ప్రభను సైతం గ్రామస్థులు ఎప్పటికప్పుడు వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. చెక్కలతో కాకుండా ఇనుప బాడీతో ప్రభను నిర్మించి కొండకు తరలిస్తున్నారు. గోవిందాపురం గ్రామస్థులు అర్ధ శతాబ్దానికి పైగా ప్రభలు నిర్మించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రభల పండగకు దేశ, విదేశాల్లో ఉన్న బంధువులు సైతం తరలివస్తారు. ఇక ఒకేచోట పది ప్రభలు నిర్మించే ప్రాంతంగా పురుషోత్తమపట్నం కోటప్పకొండ తిరునాళ్ల చరిత్రలో తన ప్రత్యేకత చాటుకుంటుంది.

ప్రభలకు నాయకులు, సినీ నటుల బ్యానర్లు: విద్యుత్ ప్రభలను తయారుచేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్కో ప్రభ తయారీ కోసం నెల ముందు నుంచే గ్రామంలోని చిన్నాపెద్దా తేడా లేకుండా నిర్మాణంలో పాల్గొంటారు. ఒక్కో ప్రభ 80 నుంచి 90 అడుగుల ఎత్తుంటుంది. ఎత్తైన విద్యుత్ ప్రభలు తయారు చేసే సమయంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల ఆదేశాలతో యువకులు, విద్యావంతులూ విద్యుత్‌ప్రభలు తయారీలో పాల్గొంటారు. ప్రభలపై శివయ్య ప్రతిమతోపాటు కిందనే తమకు నచ్చిన నాయకులు, సినీనటుల బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రభ తరలింపు సమయంలో వచ్చే ఆటంకాలు ఎక్కువగానే ఉంటాయి. మధ్యలో ప్రభ ఒరిగిపోవడం, ఇరుసులు విరిగిపోవడం జరుగుతుంటాయి. అయితే ప్రభకు ఇరువైపులా పంబతాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ ఊరంతా ప్రభ వెంట ఉంటారు. దీనికోసమే గ్రామస్థులు, యువత ఎక్కడ ఉంటున్నా శివరాత్రి మూడు రోజులపాటు ఊరిలోనే ఉండిపోతారు. తమ పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

'ప్రసాద్' పథకానికి ఎంపికైన అరసవల్లి ఆలయం - ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక శోభ దిశగా చర్యలు

ABOUT THE AUTHOR

...view details