Madanapalle Sub Collector Office Fire Incident Update :అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఈ ఏడాది జులై 21న ఉద్దేశ పూర్వకంగానే అగ్గి రాజేశారని, రికార్డులను తగలబెట్టడం ద్వారా భూ అక్రమాల సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేసేందుకే ఈ దురాగతానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా వెల్లడించారు. ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసి అక్కడ నిల్వ చేశారని పేర్కొన్నారు. ఆర్డీవోలుగా పని చేసిన మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్ నాయుడుతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ తుకారాం, సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం, భూ కుంభకోణాలకు సంబంధించి ఇప్పటికే విధుల నుంచి సస్పెండైన పూర్వ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ సహాయకుడు గౌతమ్‌తేజ్‌లపై అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా గురువారం (నవంబర్ 14న) ఉత్తర్వులు ఇచ్చారు. నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములు, డి.పట్టా భూముల్ని తప్పించడంలో మాజీ మంత్రితో పాటు పలువురు అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికలో గుర్తించిన పలు అంశాలను ఉత్తర్వుల్లో తెలియజేశారు.
ఎసైన్డ్ భూములపై హక్కులకు : మదనపల్లె సబ్ డివిజన్‌లో 79,107 ఎకరాలకు పూర్తి హక్కులు (Free Hold) కల్పించాలని ఎమ్మార్వో నుంచి ప్రతిపాదనలు అందాయి. 74,374 ఎకరాలకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 4,732 ఎకరాలను కలెక్టర్ తిరస్కరించారు. ఎమ్మార్వో నుంచి అందిన ప్రతిపాదనల్లో 2003 తర్వాత ఎసైన్ చేసిన భూములు, వివాదాలు, కోర్టు కేసులు నడుస్తున్నవి, ప్రభుత్వ భూములు తదితరాలు ఉన్నాయి. వీటి అన్నింటికీ పూర్వస్థాయి కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పటి మదనపల్లె ఆర్డీవో కూడా కలెక్టరేట్‌కు అక్రమంగా కొన్ని ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
మురళిని వారంవారం కలిసిన తుకారాం, మాధవరెడ్డి :మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పీఏ తుకారాం, సన్నిహితుడు మాధవరెడ్డి ప్రతి వారంవారం పూర్వ ఆర్డీవో (EX RDO) మురళిని కలిసేవారని, ఆయన ఇంటికి వెళ్లేవారని, నగదు లావాదేవీలను నేరుగా నిర్వహించేవారని ఆర్డీవో సీసీ మణి ముదలియార్ పేర్కొన్నారు. వారు వెళ్లిపోయాక ఆర్డీవో ఫోన్ చేసి గౌతమ్‌తేజ్‌ను పిలిచేవారని తెలిపారు. దస్త్రాలను అనుకూలంగా తయారు చేయాలని అతనికి చెప్పేవారని వివరించారు. 22ఎ డీ నోటిఫికేషన్ నివేదికలను మార్చి, వారికి అనుకూలంగా ఇవ్వాలని ఎమ్మార్వోకు కొన్ని సార్లు మురళి సూచించారు.