Heavy Rains in Andhra Pradesh : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంతమేర బలహీనపడి సముద్ర తీరానికి సమీపంలోనే ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వద్దే అల్పపీడనం ఉండటం వల్ల ఆకాశం పూర్తిగా మేఘాలతో కమ్ముకుని ఉన్నట్లు తెలిపింది. రాబోయే మరో రెండు రోజులపాటు వాతావరణం ఇదే తరహాలో కొనసాగుతుందని తెలిపింది. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశమున్నట్లు పేర్కొంది.
వైజాగ్ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం (డిసెంబరు 26) వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం(23) నుంచి గురువారం(26) వరకు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముననట్లు పేర్కొంది.
పశ్చిమ గాలుల ప్రభావంతో :ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల (డిసెంబరు) 16న అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడింది. తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులందరూ భావించారు. కానీ తర్వాత రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చింది. మరో రెండు రోజుల అనంతరం వాయుగుండంగా మారింది. శనివారం (డిసెంబరు 21న) తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.