Heavy Rains in Andhra Pradesh : ఏపీలోని నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఉత్తర భారతదేశం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి ఈ అల్పపీడనంతో పాటు తేమను తనవైపు లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బుధవారం కల్లా క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరోక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
మూడు రోజులు వర్షాలు : వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ పేర్కొంది. బుధవారం రోజున నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. బుధవారం(డిసెంబరు 25న) మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది.
అన్ని పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు :రాష్ట్రంలోని దాదాపు అన్ని పోర్టుల్లో మూడో నంబరుపై ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం (డిసెంబరు 28) తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గనున్నాయి. మంగళవారం నిన్న(డిసెంబరు 24) తూర్పుగోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు తదితర జిల్లాల్లో కాస్తా తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలోనే ఉండడంతో సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘాలతో నల్లగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నందిగామ, గన్నవరం, ళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గాయి.