Lovers Commit Suicide In Medak :వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. కానీ వారి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు చెప్పటంతో ఇద్దరూ కలసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం : నిజాంపేట్‌కు చెందిన కర్పె ఉదయ్ కుమార్ (21) మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. 3 నెలల క్రితం అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన రోహిత (20) నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో గ్రామస్థుల సమక్షంలో ఇద్దరికీ సర్దిచెప్పారు. ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ల ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందారు.
ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య : దీంతో నిజాంపేట నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమతో స్థానిక ఆచారం ప్రకారం బొట్టు పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ ఆనంద క్షణమే వారికి చివరి క్షణమైంది. పెళ్లితో ఒక్కటైన మరుక్షణమే, అదే గదిలోని ఫ్యాన్‌కు ఇద్దరూ ఒకే తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.