Liquor Shops Allotment Process Completed in AP :ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 శాతం దుకాణాలు మహిళలకు లాటరీలో దక్కాయి. విజయవాడ సహా కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లాటరీ కొట్టారు. షాపులు దక్కించుకున్నవారు రేపటి నుంచి వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక నిర్వహించారు. లాటరీలో 345 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. సోమవారం (అక్టోబర్ 14న) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి.
మద్యం దుకాణాలపై మహిళల ఆసక్తి - కేటాయింపు ప్రక్రియ పూర్తి
తెలంగాణ వారికి వరించిన దుకాణాలు :ఈ 3 దుకాణాల లైసెన్సులు లాటరీలో తెలంగాణ వారికి వరించాయి. 96వ నంబరు దుకాణం ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు, 97వ నంబరు దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు, 81వ నంబరు దుకాణం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు లభించాయి. ఏలూరు జిల్లా కుక్కునూరులోని 121వ నంబరు దుకాణానికి 108 దరఖాస్తులు రాగా విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడుకు చెందిన కామినేని శివకుమారి లాటరీలో దక్కించుకున్నారు.
బీజేపీ అధ్యక్షుడికి 5 దుకాణాలు : అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బల్లో 5 మద్యం దుకాణాలు దక్కాయి. అల్లూరి జిల్లాలో మొత్తంగా 40 దుకాణాలకు గాను 1205 దరఖాస్తులు వచ్చాయి. చింతపల్లికి చెందిన ఓ వ్యక్తి 60 అప్లికేషన్లు పెట్టగా మూడు షాపులు లాటరీలో వచ్చాయి. పెదబయలులో వికలాంగుడికి మద్యం దుకాణం లాటరీలో వచ్చింది. జిల్లాలో మద్యం దుకాణాలు నిర్వహణ గిరిజనులకే కేటాయించడంతో ఓ గిరిజనేతరుడు దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఓ దుకాణం రావడంతో నిబంధనల ప్రకారం రద్దు చేశారు.