Life imprisonment In kidnap and Marriage Case : ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం, ప్రేమను అంగీకరించాలంటూ వేధించడం చేస్తున్నారు కొందరు యువకులు. కొన్నిసార్లు అమ్మాయి ప్రేమను అంగీకరించిన తర్వాత అసలు రంగు బయట పెడుతున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో దూషించడం, కొన్నిసార్లు కొట్టడం కూడా చేస్తుంటారు. అమ్మాయిలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. తాజాగా ప్రేమ పేరుతో మభ్యపెట్టి 16 ఏళ్ల బాలికను అపహరించి పెళ్లి చేసుకున్న ఓ నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధించింది.
రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత బర్ల కథనం ప్రకారం : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లఖానాపూర్‌కి చెందిన కుందగోకరి కురుమూర్తి (35) హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్కి చెందిన ఇంటర్ చదివే అమ్మాయి(16)ని ప్రేమిస్తున్నట్లు వెంట పడేవాడు. 2017లో కళాశాలకు బస్సులో వెళ్తున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి మార్గమధ్యలో కిందికి దింపి, తన ద్విచక్ర వాహనంపై నార్కట్‌పల్లి సమీపంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.