Telangana Assembly Sessions : తెలంగాణ శాసనసభలో టూరిజం పాలసీపై రేపు స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ నెల (డిసెంబరు) 9వ తేదీన మొదలైన సమావేశాలు 16వ తేదికి వాయిదా పడ్డాయి. రేపటి నుంచి తిరిగి శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రేపు జరగనున్న బీఏసీ(Business Advisory Committee) మీటింగ్‌లో ఎప్పటి వరకు సమావేశాలు కొనసాగుతాయో అనే విషయంపై (పనిదినాలపై) నిర్ణయం ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభం కానుంది.
సంతాపం : ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యలకు శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల పర్వం కొనసాగుతుంది. శాసన సభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబులు ఇస్తారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ-2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్‌మెంట్ బిల్లు-2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు : ప్రభుత్వం కోఆపరేట్ చేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు, స్టడీటూర్లు నిర్వహిస్తామని కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. త్వరలో శాసనసభ, శాసనమండలి కమిటీలనూ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శాసనసభ, మండలి సభ్యులకు ఏర్పాటుచేసిన రెండు రోజుల పునశ్చరణ తరగతులు గురువారం(డిసెంబరు 12)న ముగిశాయి.