Amrit Bharat Scheme in Telangana : హైదరాబాద్ పరిధిలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇందుకోసం ఏకంగా రూ.514.49 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే చర్లపల్లి స్టేషన్ పనులు పూర్తికాగా వచ్చే ఏడాదికి సికింద్రాబాద్ స్టేషన్ అందుబాటులోకి తయారుకానుంది. చర్లపల్లి కోసం రూ.430 కోట్లు, సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ.720 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాకుండా మరో 11 స్టేషన్లను అమృత్‌భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
12 హైదరాబాద్‌లోనే :మల్కాజిగిరి, బేగంపేట, యాకుత్‌పుర, ఉమ్దానగర్ స్టేషన్ల పనులు మరో 6 నెలల్లో పూర్తికానున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మరో ఏడు స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పథకం లో రాష్ట్రవ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా హైదరాబాద్‌లోనే 12 స్టేషన్లు ఉండటం గమనార్హం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
అభివృద్ధి పనులివే
- ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు, స్టేషన్‌కు దారితీసే రోడ్లు వెడల్పు చేయడం ద్వారా రాకపోకలు సులభతరం చేయడం.
- ప్రయాణికుల సౌకర్యార్ధం సైన్ బోర్డులు, వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాల అభివృద్ధి, స్టేషన్‌లో విద్యుదీకరణ.
- ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చదనం, కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలు, స్టాళ్ల ఏర్పాటు.
- సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రాంగణానికి రెండో ప్రవేశాన్ని ఏర్పాటు చేయడం, స్టేషన్ భవన నిర్మాణం.
- ఎక్కువ ఎత్తులో ప్లాట్‌ఫాంల ఏర్పాటు, సరిపడా షెల్టర్ల నిర్మాణం.
- మరింత నాణ్యత గల ఎల్‌ఈడీ స్టేషన్ నేమ్ బోర్డులు, అధునాతన వెయిటింగ్ హాళ్ల అభివృద్ధి, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్.
- నగర కేంద్రాలుగా స్టేషన్లను అభివృద్ధి చేయడం, స్టేషన్ భవనాల అభివృద్ధి, పునరాభివృద్ధి, రద్దీకి ఆస్కారం లేకుండా ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటు