Lack of Facilities in Medical College Hostels: వైద్య కళాశాలల నిర్మాణాలను పటిష్ఠంగా చేపట్టాలని, ఎందుకంటే చేపట్టే పనులు ఇప్పటి తరానికే కాదు భవిష్యత్తు తరాలకు ప్రయోజనం కల్పించేవి కావాలని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటివల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజల్ని రక్షించుకోవడానికి ఉపయోగపడతాయని గొప్పలు చెప్పారు. కానీ వాస్తవ మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.
జబ్బుల బారిన పడిన రోగులకు చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యశాస్త్రం అభ్యసిస్తున్న భావి వైద్యులు ప్రభుత్వం పెట్టే సహన చికిత్సను ఎదుర్కొంటున్నారు. ముక్కుతూ మూలుగుతూ మంచాన పడిన రోగులకు చికిత్సలు చేయడం దేవుడెరుగు. వసతి గృహాల్లోని అసౌకర్యాలతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. గదుల కొరత, దోమల బెడద, అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం భోజనం తదితర సమస్యలతో చదువులు ఈడుస్తున్నారు. అయినా ఆరోగ్యాంధ్రను నిర్మించడంలో కీలకమైన భావి వైద్యులకు సౌకర్యాలు కల్పించడంపై సీఎం జగన్ పట్టించుకోవట్లేదు.
నాడు-నేడు కింద 3 వేల 820 కోట్లతో 11 బోధనాసుపత్రుల్ని అభివృద్ధి చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఆ నిధులతో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, వసతి గృహాల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పలు చెప్పుకొంది. ఆచరణలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. పీజీ సీట్ల పెంపునకు తగ్గట్లు రాష్ట్రానికి కేంద్రం 756 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ నిధులతో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నిధుల కొరతతో కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న గదులపై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి.
వసతి గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న మెడికోలు- వసతి గృహాల నిర్వహణ గాలికొదిలేసిన వైసీపీ
నత్తనడకన నిర్మాణ పనులు:వందేళ్ల చరిత్ర కలిగిన విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో గదుల కొరత నెలకొంది. ఇక్కడి ఐదు వసతి గృహాల్లో కనీస వసతులు లేవు. కాలేజీ ఏర్పడిన తొలినాళ్లలో ప్రారంభించిన వసతి గృహాలే ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పీజీ, యూజీ వసతి గృహాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జనవరిలో ప్రారంభమైన నిర్మాణ పనులు శ్లాబుల దశను దాటలేదు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. కళాశాలలో యూజీ కోర్సుల్లో ఏడాదికి 250 మంది చొప్పున ఐదేళ్లకు కలిపి 12 వందల 50 మంది ఉన్నారు. వీరిలో 60 శాతం మంది మహిళలే. పీజీ, హౌస్ సర్జన్స్ విద్యార్థుల సంఖ్య 2,541. ఇందులో కేవలం 11 వందల మందికే వసతి గృహ సదుపాయం ఉంది.
బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు పాత వసతి గృహ భవనాల్లో అసౌకర్యాల మధ్య బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. తాగునీటి సౌకర్యం కరవైంది. భోజనం నాణ్యంగా లేకపోవడంతో కొందరు విద్యార్థులు గదుల్లోనే సొంతంగా వండుకుంటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇక్కడి ప్రాంగణంలో కొత్తగా చేపట్టిన గదుల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా 1985లో వసతి గృహం నిర్మించారు.
ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ వసతి గృహంలోనే సుమారు 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. 22 కోట్ల రూపాయలతో 400 మంది విద్యార్థులకు సరిపడా భవన నిర్మాణ పనులకు గత ప్రభుత్వ హయాంలో 2017 నవంబరులో శంకుస్థాపన జరిగింది. నిర్దేశించిన లక్ష్యం మేరకు 18 నెలల్లో పూర్తికావాలి. కానీ ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. పూర్తయిన పనులకు తగ్గట్లుగా వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటివరకు భవన నిర్మాణం పూర్తవలేదు. విద్యార్థులు పాత భవనంలో అసౌకర్యాల మధ్య కాలం గడుపుతున్నారు. భవనం పైనుంచి పెచ్చులూడి పడుతుండటంతో విద్యార్థినులు బెంబేలెత్తుతున్నారు.