Lack Of Facilities In Bhupalpally Junior College :ప్రభుత్వ కళాశాలల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులే ఎక్కువగా చదువుతుంటారు. భూపాలపల్లి జిల్లాలోని 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. గదుల కొరత వేధిస్తోంది. మరుగుదొడ్లకు నీళ్ల సరఫరా లేదు. సిబ్బందే బకెట్లతో నీళ్లు మోసుకెళ్తున్నారు. ఎంత కష్టపడినా జీతాలు సమయానికి ఇవ్వడం లేదని పారిశుద్ధ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గానీ తిండి దొరకని పరిస్థితి ఉందని, జీతాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకుంటున్నారు.
Lack Of Water Facilities In College :భూపాలపల్లి కృష్ణా కాలనీ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తాగునీటి బోరు ఉంది. కానీ పైపులైన్ సౌకర్యం లేక కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంటోంది. మూత్రశాలలు బాలికలు, బాలురకు వేరుగా ఉన్నా, వాటికి నీటి సౌకర్యం లేదు. నల్లాలు ధ్వంసమయ్యాయి. మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులతో పాటు లెక్చరర్లు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
సమస్యలపై అధికారులు స్పందించాలని కోరుతున్న లెక్చరర్లు :కళాశాలలో కొద్ది నెలల క్రితం ఆర్వో ప్లాంట్ పాడవ్వడంతో స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. సమస్యలు తిష్ట వేయడం వల్లే ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదరణ తగ్గుతోందని అధ్యాపకులు చెబుతున్నారు. సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా, పట్టించుకోలేదని లెక్చరర్లు వాపోతున్నారు. జూనియర్ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు. అధికారులు స్పందించి కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపించాలని విద్యార్థులు కోరుతున్నారు.