28 People Trapped in Bhadradri Floods :ఒక్కసారిగా పోటెత్తిన వరద, చుట్టుముట్టిన వర్షఫు నీరు, ఒక్కసారిగా ఊహించని విధంగా వరదల్లో చిక్కుకున్న 28 మంది బాధితులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో రహదారికి నాలుగు వైపులా వరద ప్రవాహం చుట్టేడయంతో మధ్యాహ్నం పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు చిక్కుకున్నారు.
పొలం పనులకు వెళ్లిన వారు వరద తీవ్రత పెరగడంతో బయటపడేందుకు ప్రయత్నించినా ప్రవాహం పెరిగి భారీగా వరద చుట్టుముట్టింది. దీంతో 21 మంది ఒకచోట, ఆరుగురు ఇంకోచోట, మరో వ్యక్తి మరొకచోట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పశువుల కాపరులు ఆరుగురు చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు వరదల్లో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్నారు. రహదారిపై నుంచి వరద ప్రవాహం పెరిగి ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయినా బాధితులంతా ఒక్కచోటే ఒకరిసాయంతో ఇంకొకరు కదలకుండా నిలబడ్డారు.
దీనికి తోడు పెద్దవాగు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ఉద్ధృతి ఒకేసారి పోటెత్తింది. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో కొన్ని చెరువులు తెగిపోవడంతో ఆ వరద కూడా పెద్దవాగుకు రావడంతో వరద ఉద్ధృతి మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో వరద తీవ్రత అంతకంతకూ పెరిగి బాధితులు హాహాకారాలు చేశారు. బాధితులతో పాటు వరదల్లో చిక్కుకున్న వేలేరుపాడు వైద్యాధికారిణి అనూష ఏలూరు కలెక్టర్, పోలవరం ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు. స్థానికుల ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచారం చేరవేశారు.