తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో రెండేళ్లు సర్దుకుపోవాలంటున్న మెట్రో అధికారులు - HYDERABAD METRO COACHES

మెట్రో రైళ్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ - కొత్తవి కొని అందుబాటులోకి వచ్చేందుకు కనీసం రెండేళ్లు

Hyderabad Metro Coaches Capacity
Hyderabad Metro Coaches Capacity (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2025, 2:22 PM IST

Updated : Jan 9, 2025, 3:51 PM IST

Hyderabad Metro Coaches Capacity :మెట్రో రైళ్లలో రద్దీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. పుణె, నాగ్‌పుర్ నుంచి లీజు పద్ధతిలో కోచ్‌లను తీసుకురావాలనే ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో కొత్త కోచ్‌లు కొనేందుకు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ దేశీయంగా మెట్రో కోచ్‌లు తయారు చేసే 3 సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత, తయారు చేసి సరఫరా చేసేందుకు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. వెరసి మరో రెండు సంవత్సరాలైనా పడుతుంది. అదీ కూడా ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తేనే. అప్పటి వరకు ఇప్పుడు ఉన్న కోచ్‌లతోనే సర్దుబాటు చేసుకోక తప్పదని మెట్రో అధికారులు అంటున్నారు. లీజుకు తీసుకునేందుకు పుణె, నాగ్‌పుర్ మెట్రో రైళ్లను సంప్రదించినా, అక్కడ కూడా రద్దీ పెరుగుతుండటంతో ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.

మెట్రో రైళ్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, కాలు లోపల పెట్టేంత స్థలం కూడా దొరకడం లేదని ప్రయాణికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో మరింత అధికంగా రద్దీగా ఉంటుంది. మధ్యలోంచే కొన్ని మెట్రో రైళ్లను (షార్ట్‌ లూప్స్‌) నడుపుతున్నా సరిపోవడం లేదు.

నిత్యం సగటున 5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మెట్రో రైళ్లు 7 లక్షల వరకు సరిపోతాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. కొద్దిగా క్రమ శిక్షణ పాటిస్తే కొత్త కోచ్‌లు వచ్చే వరకు వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. తలుపుల వద్దే చాలా మంది ఉంటున్నారని, చాలా సార్లు లోపల ఖాళీగా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు సహకరిస్తే కొత్తవి వచ్చే వరకు ఇప్పుడు ఉన్న వాటితో సర్దుబాటు అవుతుందని అధికారులు అన్నారు.

సర్కారు సహకరిస్తే కోచ్‌ల కొనుగోలు :రద్దీని తట్టుకునేందుకు కొన్ని సర్వీసులు(షార్ట్‌ లూప్స్‌) నడుపుతున్నామని, 7 లక్షల ప్రయాణికుల సంఖ్య దాటితే అదనపు కోచ్‌ల అవసరం ఉంటుందని ఎల్​అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి హ్యుందాయ్‌ రోటెమ్‌ సంస్థ సరఫరా చేసిన మెట్రో రైళ్లను నడుపుతున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ భారత్‌కు కోచ్‌లను సరఫరా చేయడం లేదని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మెట్రో సంస్థకు ప్రభుత్వ తోడ్పాటు అందిస్తే దేశంలోనే ఉన్న సంస్థల్లో కొత్త కోచ్‌ల తయారీకి ఆర్డర్‌ ఇవ్వొచ్చని తెలిపారు. 10 మెట్రో రైళ్ల కొనుగోలుతో 10 లక్షల ప్రయాణికుల దాకా సర్దుబాటు అవుతుందని ఆయన అన్నారు.

పాటలు, డాన్స్​, కవితలు ఇవన్నీ మీకు వచ్చా?- అయితే సూపర్​ ఛాన్స్​ ఇచ్చిన మెట్రో ఎండీ

మెట్రో విస్తరణపై సమీక్ష - అప్పుడే టెండర్లు పిలవాలని నిర్ణయం

Last Updated : Jan 9, 2025, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details