KTR Visited Sircilla Prisoners at Peddur : ఏళ్లపాటు దుబాయ్ జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలై స్వస్థలాలకు చేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామస్థులు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల కుటుంబాలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పరామర్శించారు. గల్ఫ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు. లక్షల కుటుంబాలు రాష్ట్రం నుంచి వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారని, తెలంగాణలో అపార అవకాశాలు ఉండగా విదేశీ బాట పట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు 18 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన బాధితులే ఉదాహరణ అని అన్నారు.
సిరిసిల్ల స్థానికుల ద్వారా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆ సమయంలో అధికారంలో లేకున్నా, నేపాల్ వరకు వెళ్లి 15 లక్షల రూపాయలు అందించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. కానీ దుబాయ్(Dubai) చట్టాల్లో మార్పుల వల్ల అప్పుడు వీరి విడుదల సాధ్యం కాలేదన్నారు. ఇంకా ఏడేళ్ల శిక్షాకాలం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. వీరికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి చాలా మంది ఇక్కడ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని, రాష్ట్రంలోని యువకులు గల్ఫ్ బాట పట్టవద్దని, వెళ్లేవారు ఇక్కడే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని సంతోషంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.