KTR Comments On ACB Investigation :ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని కేటీఆర్ మీడియాకు తెలిపారు. అధికారులకు అన్ని విధాలా సహకరించానని, విచారణకు ఎన్ని సార్లు పిలిచినా, హాజరవుతానని తెలిపారు. ఇదొక చెత్త కేసు అని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు.
నాలుగు ప్రశ్నలనే 40 రకాలుగా ప్రశ్నించారు :నాలుగు ప్రశ్నలనే 40 రకాలుగా ప్రశ్నించారని ఎద్దేవా చేశారు. ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదన్నారు. ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. పైసలు పంపాను అని తానే చెబుతున్నానని, ఆ డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. సాయంత్రం 5.15 సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
విచారణ సమయంలో కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ విచారణను పర్యవేక్షించారు. ఈ విచారణను వేరే గది కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావు చూసేలా ఏర్పాట్లు చేశారు.