KTR Slams On Congress Over Party Defections :ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించింది కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే హస్తం పార్టీ అని ధ్వజమెత్తారు. 2014కు ముుందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు 9 సార్లు అధికారమిచ్చారు, కానీ ఆ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి పదేళ్లు కేసీఆర్ నేతృత్వంలో మంచి పాలన అందిందని పేర్కొన్నారు.
"అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతకంతో హామీ ఇచ్చారు. సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ముందు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7నెలలు పూర్తి అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. ఆరు గ్యారంటీలను మరిచిపోయింది. కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలను మాత్రం తీసుకుంది. ఆరుగురు ఎమ్మెల్సీలను, ఒక రాజ్యసభ ఎంపీలను కూడా తీసుకున్నారు." - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్