AP DY CM Pawan inspects Kakinada Port : కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ వ్యవస్థీకృతం చేశారని దేశ రక్షణకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పవన్ పరిశీలించారు. పోర్టు సీఈవోకు నోటీసులు పంపి ఓడను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్మగ్లింగ్‌ను కూకటివేళ్లతో సహా పెకలిస్తామని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.
జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశం : అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలకు మాటిచ్చిందని అక్రమ రేషన్ బియ్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన బియ్యాన్ని స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని ఆయన అన్నారు. ఇది కేవలం బియ్యం అక్రమ రవాణానే కాదని జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అంశంగా పరిణమించిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాకినాడ పోర్టు స్మగ్లింగ్‌కు హబ్‌గా మారింది : కాకినాడ పోర్టులో పర్యటించకుండా తననే అడ్డుకునేంత స్థాయిలో ఇక్కడ అక్రమార్కులు పెచ్చుమీరిపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు స్మగ్లింగ్‌కు హబ్‌గా మారిందన్న పవన్, ఈ అవినీతి కోటను బద్దలు కొడతామని తేల్చి చెప్పారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లోని 1,064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు.
అధికార యంత్రంగం ఏం చేస్తుంది : రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాకినాడ సముద్రంలో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యాన్ని పవన్‌కల్యాణ్ అధికారులతో కలిసి సముద్రంలోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అక్రమ రవాణాకు అడ్డుకట్టలు వేస్తున్నా బియ్యం పోర్టుకు చేరుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని పవన్ మండిపడ్డారు.
ప్రతీసారి ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా అడ్డుకుంటేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ స్మగ్లింగ్‌పై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బియ్యం అక్రమ రవాణాపై అలసత్వం ప్రదర్శించిన కాకినాడ జిల్లా డీఎస్సీఓ ప్రసాద్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ను పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇన్‌ఛార్జ్ డీఎస్‌సీవోగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించింది.