KTR on Konatham Dileep Arrest :రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టుపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎక్స్‌వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి అదుపులోకి తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు.
కొన్ని రోజుల క్రితం కూడా కొణతం దిలీప్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అయినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్న కేటీఆర్, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని కేటీఆర్ ఆక్షేపించారు.
ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా అని కేటీఆర్ నిలదీశారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది భ్రమే అన్న ఆయన, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింతగా పుట్టుకొస్తారని అన్నారు. అక్రమంగా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు.