KTR Fires on CM Revanth about Farmer Loan Waiver : ఎన్నికలకు ముందు రుణమాఫీ చేయటంతో పాటు కొత్త రుణాలు ఇప్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కూడా కట్టొద్దన్న రేవంత్, అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై మౌనం పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని నీటిలో ముంచి రైతులను నయవంచనకు గురి చేశారని ఆరోపించారు.
తీసుకున్న రుణాలను చెల్లించాలని బ్యాంకు వాళ్లు రైతులకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని, రేవంత్ రెడ్డి రైతులకు బూటకపు మాటలు చెప్పి వారిని బురిడి కొట్టించారని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం పాటిస్తోందని, ఇంతటి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలను ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మౌనం పాటిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
KTR Fire on Fake Youtube Channels : బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని ఎక్స్ వేదికగా మరో ట్వీట్లో కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్దాలను చూపిస్తున్నాయని ధ్వజమెత్తారు. గుడ్డి వ్యతిరేకత వల్ల లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి, ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇది వ్యక్తిగతంగా తనతోపాటు, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని కేటీఆర్ ఎక్స్‌లో వివరించారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా తమపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసి, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గ పూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు - CASE AGAINST MP JOGINAPALLY SANTOSH
నేను చేరలేని దూరం కాదు - దొరకనంత దుర్గం కాదు - సామాన్య మనిషిని నేను : సీఎం రేవంత్ - CM Revanth on Common People