KTR Tweet on Rahul Gandhi : రాష్ట్రంలో కూల్చివేతలపై రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల గళం రాహుల్ గాంధీకి వినిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. సమస్యలు వస్తే యువత, ప్రజలు, చిన్నారి అయినా సరే పిలిస్తే వస్తానని తుక్కుగూడ కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. సదరు వీడియోను ఎక్స్‌లో పొందుపర్చారు. రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి తెలంగాణకు వచ్చి మూసీ ప్రాజెక్టు ప్రభావిత ప్రజలను కలవాలని కేటీఆర్ సూచించారు.
దిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం :అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపైనా కేటీఆర్ మండిపడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 23 సార్లు హైద్రాబాద్- సికింద్రాబాద్‌కు తిరిగినట్టు దిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎంకు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదు లక్షల మంది రైతన్నలు రెండు లక్షల రూపాయల లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కండ్లు కాయలు గాసేలా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తిరైతులు దళారుల చేతిలో దగా అయ్యి అల్లాడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక పాలన పుణ్యమా అని ఈ దసరా తెలంగాణ ప్రజలకు దసరాలాగా లేకుండా పోయిందని మండిపడ్డారు.
మరోవైపు కేటీఆర్ ఇవాళ మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎప్పుడు ఇళ్లు కూల్చుతారో అని ప్రజలు ఆవేదనలో ఉన్నారని, హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారని దుయ్యబట్టారు. మూసీమే లూఠో.. దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని దుయ్యబట్టారు.