KTR Attend ACB Inquiry in Formula E-Race Case :ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఆయనతో పాటు న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయంలోనికి అనుమతించారు. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ విచారణను పర్యవేక్షించారు. ఈ విచారణను వేరే గది కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావు చూసేలా ఏర్పాట్లు చేశారు.
అంతకుముందు తన నివాసం నుంచి బయలుదేరే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తన బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని, కేబినెట్‌లో ఉండి తన కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని తెలిపారు. తాను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదని, ఆ పనులు రేవంత్ రెడ్డి, వారి సహచర మంత్రులకే ఉన్నాయని అన్నారు. అరపైసా అవినీతి కూడా చేయలేదని ఆయన పేర్కొన్నారు.
భయపడేది లేదు : తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ పటంలో పెట్టడానికి కృషి చేశానని, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే బీఆర్‌ఎస్ ప్రశ్నించిందని, ముమ్మాటికీ రేవంత్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తునే ఉంటామని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా, భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అవసమైతే ప్రాణాలు వదిలేస్తానని తెలిపారు. కేసీఆర్ కుమారుడిగా తెలంగాణ కోసం చస్తా తప్పా, తప్పుడు పనులు చేయనని పేర్కొన్నారు.
"నేను ఎలాంటి తప్పు చేయలేదు. సమస్యల గురించి దృష్టి మళ్లించేందుకే నాపై తప్పుడు కేసు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేశా. కేసీఆర్ కుమారుడిగా తెలంగాణ కోసం చస్తాను తప్ప తప్పు చేయను. నిజం నిలకడ మీద తెలుస్తుంది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తునే ఉంటాం. ఏం జరిగినా శాంతియుతంగానే నిరసనలు తెలపండి." -కేటీఆర్, మాజీ మంత్రి