KTR and Harish Rao Meet Kavitha in Delhi : దిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దిల్లీలోని ఈడీ కార్యాలయంలో భర్త అనిల్ సహా కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు కలిశారు. ఆమె యోగక్షేమాలపై ఆరా తీసిన కుటుంబీకులు, న్యాయ పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలువురిని ఈడీ (ED Investigation) విచారించనుంది. కవిత నివాసంలో సోదాల సమయంలో 5 సెల్ ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకోగా, వాటిలో రెండు ఫోన్లు కవితవి కాగా, మిగిలినవి ఆమె వ్యక్తిగత సహాయకులు వాడుతున్నట్లు సమాచారం. వారందరితో పాటు పలువురిని సోమవారం ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ
7 Days ED Custody for MLC Kavitha: అటు కవితను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈడీ అధికారులు నేడు తొలిరోజు ఆమెను విచారించారు. 7 రోజుల పాటు కొనసాగునున్న విచారణ, ఈ నెల 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును రౌస్ అవెన్యూ న్యాయస్థానం (Rouse Avenue Court) కల్పించింది. ఇంటి నుంచి భోజనానికీ ఓకే చెప్పింది. కవితను కలుసుకునేందుకు అనుమతి పొందిన వారిలో ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబసభ్యుల్లో హరీశ్‌రావు, ప్రణీత్, ఇతర న్యాయవాదుల బృందం పేర్లు ఉన్నాయి. కవితను కలుసుకునేందుకు కేటీఆర్, హరీశ్‌రావు సహా ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ ఉదయం దిల్లీ వెళ్లారు.