KTR about Forest and Trees in Telangana : దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)తెలిపారు. ప్రకృతి ప్రేమికులందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం తీసుకున్న చర్యలను ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవి సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్లిన ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం, 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం, ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని కేటీఆర్ వివరించారు.
KTR on Haritha Haram in Telangana : సుమారు 15 వేల నర్సరీల పెంపకంతో మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయం అన్న కేటీఆర్, ఎనిమిది శాతం పచ్చదనం పెరగడం దేశంలో ఎప్పుడూ లేదని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదన్న ఆయన, చిక్కిశల్యమైన అడవులు, సకల జీవరాశులను సంరక్షించడమని నలుదిశలా చాటిచెప్పిన నాయకత్వం మనది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల ప్రస్థానం పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం అన్న ఆయన, నాడు ప్రతి పల్లె పచ్చదనంతో మురిసిందని, ప్రతి పట్నం హరిత శోభతో వెల్లివిరిసిందని తెలిపారు. నేడు గ్లోబల్ వార్మింగ్(Global Warming)తో మానవాళికి వార్నింగ్లు, ఎటుచూసినా క్లౌడ్ బస్టులు, కుండపోతల ప్రమాద ఘంటికలు అని పేర్కొన్నారు.