KRMB Board Meeting in Hyderabad : హైదరాబాద్ జలసౌధ వేదికగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కేఆర్‌ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మొత్తం 29 అంశాలతో కూడిన అంశాలపై కీలక చర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ నీటి వాటాల పంపిణీ, బోర్డు నిర్వహణ, బడ్జెట్, రాష్ట్రాల నుంచి నిధులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు కార్యాలయం తరలింపు, ప్రాజెక్టుల స్వాధీనం సహా ఇతర అంశాలపై ప్రధానంగా కీలక చర్చలు జరిగాయి.
"కృష్ణా నదీ జలాల మళ్లింపు విషయాన్ని బోర్డు సమావేశంలో ప్రస్తావించాం. కృష్ణానదీ జలాల్లో 66:34 నిష్పత్తిపై నిరసన తెలిపాం. 66:34 కొనసాగిస్తూనే పరిస్థితుల్ని బట్టి పెంచే ప్రయత్నం చేస్తామని ఛైర్మన్ చెప్పారు. తెలంగాణలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 71శాతం ఉంది. పరీవాహక ప్రాంతంలో 71శాతం మేరకు వాటా ఇవ్వాలి. అంతవరకూ కనీసం చెరి సగం నీరు ఇవ్వాలి. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరాం. టెలిమెట్రీ కోసం ప్రభుత్వంతో చర్చించి వారంరోజుల్లో స్పందిస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు" -రాహుల్ బొజ్జా, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి
నాగార్జున సాగర్‌పై కేంద్ర బలగాలను తొలగించాలి : నాగార్జునసాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు. అలాగే సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. డ్యామ్ స్లూయీజ్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తామని కేఆర్‌ఎంబీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
విజయవాడకు తరలింపు : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలోని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర రావు కోరారు. హైదరాబాద్‌లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా ఉచితంగా కార్యాలయానికి ఉచిత వసతి ఇవ్వాలని బోర్డు ఛైర్మన్ సూచించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు.